జీహెచ్‌ఎంసీ(GHMC) ఆర్థిక పరిస్థితి కష్టాల్లో కూరుకుపోయింది. ఆదాయ, వ్యయాల మధ్య నెలకొన్న వ్యత్యాసం నానాటికీ పెరుగుతోంది. నిధుల సమస్యతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది. ఆయా పనులకు సంబంధించి సుమారు రూ.500 కోట్ల మేర బిల్లులు నిలిచిపోవడంతో గుత్తేదారులు పనులు ఆపేస్తామని అంటున్నారు. ప్రభుత్వ నుంచి వచ్చే నిధులు నిలిచిపోగా ఉద్యోగులు టీకాల కార్యక్రమానికి వెళ్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్లు సైతం కొంతకాలంగా ఆగిపోయాయి. ఇలాంటి పలురకాల కారణాలతో బల్దియా ఖజానా దాదాపు ఖాళీ అయింది. వార్షిక పద్దును రూ.5,600 కోట్లతో ప్రవేశపెట్టే బల్దియా ఖజానాలో ఇప్పుడు రూ.50 కోట్లు మాత్రమే ఉండటం ఆందోళనకు తావిస్తోంది.
ఆగుతోన్న అభివృద్ధి..
● నాలాలపై మూతలు, జాలీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు(State Government) రూ.350 కోట్ల నిధుల వ్యయానికి గతేడాది అనుమతిచ్చింది. కానీ బల్దియా ఇంతవరకు 2 శాతం పనులు కూడా పూర్తవలేదు.
● వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా సర్కారు రూ.858 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిస్తే బల్దియా కేవలం రూ.1.5 కోట్లు కేటాయించింది.
● సర్కారు ఇళ్ల పనులకు సంబంధించిన రూ.350 కోట్ల మేర బిల్లులు ఆమోదానికి నోచుకోలేదు. రోడ్లు, ప్రజా మరుగుదొడ్లు, ఇతరత్రా పనులకు సంబంధించిన బిల్లులు బల్దియా ఆర్థిక విభాగంలో రూ.100 కోట్లకుపైగా ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి.
ఉద్యోగులకూ అవస్థలే..
● జీహెచ్‌ఎంసీలో కమిషనర్ నుంచి కార్మికుడి వరకు దాదాపు 30 వేల మంది పనిచేస్తుంటారు. వాళ్ల జీతాలకు ప్రతినెలా రూ.120 కోట్ల మేర అవసరమవుతోంది. రెండేళ్లుగా తమకు సకాలంలో జీతాలు అందట్లేదనిఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీపీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగులందరి నిధులను ఆర్థిక విభాగం ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపణలున్నాయి. జీపీఎఫ్ డబ్బులు ఇవ్వాలని సుమారు 100 దరఖాస్తులు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి.
సీఎం సమావేశానికి సిద్ధం
జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో శనివారం జరగనున్న సమావేశానికి జీహెచ్‌ఎంసీ(GHMC) సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి పల్లెప్రగతి కార్యక్రమంతోపాటు నగరంలోని హరితహారం, ఇతర పనులపై చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆమేరకు విభాగాల వారీగా ఏడాది పొడవునా చేపట్టిన పనులు, వాటి ఫలితాలు, మున్ముందు ప్రణాళికలతో కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్(GHMC COMMISSIONER LOKESH KUMAR) సమావేశానికి హాజరవుతారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇదీ చూడండి:WATER DISPUTES: కేసీఆర్‌కు కేంద్రజలశక్తి మంత్రి ఫోన్.. 'రాయలసీమ'కు కృష్ణాబోర్డు బృందం