హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావటం ఏటా సాధారణంగా మారింది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ దృష్టిపెట్టింది. నాలాల్లో పూడికను తొలిగించేందుకు ప్రత్యేక వార్షిక ప్రణాళికను అమలు చేస్తోంది. వర్షాకాలం ముందు, తర్వాత చేపట్టాల్సిన పనులపై.. లక్ష్యాలను నిర్దేశించుకుంది.
43.38 కోట్ల రూపాయల వ్యయంతో
అందులో భాగంగా ఈ ఏడాది.. 43.38 కోట్ల రూపాయల వ్యయంతో నాలాల్లో 4.79 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలిగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 702 కిలోమీటర్లలో.. 3.75 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలిగించారు. మరో వారంలో ఈ వర్షాకాలం నిర్దేశించిన మేరకు లక్ష్యాన్ని పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
118 మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు..
లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లపై వర్షపు నీరు తొలిగించేందుకు.... సమస్యాత్మక ప్రాంతాల్లో 118 మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు.. 79 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు 24గంటల పాటు ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి. క్షేత్ర స్థాయి అధికారులు, బృందాలతో సమన్వయం చేసేందుకు జోనల్ ఎమర్జెన్సీ బృందం ఏర్పాటు చేశారు. నిలిచిన వర్షపు నీటిని నాలాలు, కాలువల్లోకి... పంపేందుకు 202 మోటరు పంపులను అందుబాటులో ఉంచారు. వీటికి తోడు ఆధునిక సంపత్తితో.. 16 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. సమస్యాత్మకంగా ఉన్న 195 ముంపు ప్రాంతాలు గుర్తించి.. 157 చోట్ల పనులను పూర్తి చేశారు.
44 చోట్ల ఇంజక్షన్ బోర్ వెల్స్
వర్షపు నీటితో భూగర్భ జలాలు పెంచేందుకు జేఎన్టీయా ఇంజినీర్ల సూచనల మేరకు.. నగరంలో 44 చోట్ల ఇంజక్షన్ బోర్ వెల్స్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. వరద ముంపును నివారించేందుకు... 2019లో 102 కోట్లతో 439 పనులు చేపట్టారు. 2019లో 596 కోట్లతో 1968 పనులు చేపట్టి... 928 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 22 కోట్లతో 23 పనులు చేపట్టి.. 48 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు చేశారు. వీటితో పాటు 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను.. ఏజెన్సీలకు అప్పగించారు. ఆ మార్గంలో వరద ముంపును నివారించేందుకు... రీకార్పెటింగ్, ఇతర మరమ్మతులను చేపట్టారు.
ఇదీ చూడండి:నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన