ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. ఈ నెలలో ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్లో రూ.750 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి వారంలోనే రూ.123 కోట్లు రాబట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎర్లీ బర్డ్ 2023-24 సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పించే అవకాశాన్ని కల్పించింది. ఈ ఎర్లీబర్డ్ ఆఫర్ ఏప్రిల్ నెలాఖరు వరకు అమలు కానుంది. జోన్లు, సర్కిళ్ల వారీగా ఎంత పన్ను వసూలు చేయాలనే లక్ష్యాన్ని బల్దియా ఏర్పాటు చేసింది.
ఆస్తి పన్నుకై నిర్దేశం :ఆస్తి పన్ను ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అధికారులకు ప్రతి నెలా ఎంత వసూలు చేయాలో లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సర పన్ను వసూళ్లపై బల్దియా ప్రధానంగా దృష్టి సారించింది. ఎర్లీ బర్డ్ పథకం గురించి 13 లక్షల మంది యజమానుల ఫోన్ నంబర్‌లకు ఇప్పటికే సందేశాలు పంపింది. మొత్తం జోన్ల వారీగా టార్గెట్లు ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ జోన్లో 105.68, చార్మినార్ జోన్లో 46.43, ఖైరతాబాద్ జోన్లో 201.66, శేరిలింగంపల్లి జోన్లో 160.3, కూకట్పల్లి జోన్లో 118.97 కోట్లు, సికింద్రాబాద్ జోన్లో 117.24 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.