కేరళలోకి రుతుపవనాలు ఈ వారంలో ప్రవేశిస్తాయని, త్వరలో రాష్ట్రంలో భారీవర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ సమాచారంతో పంటను కాపాడుకునేది ఎలా అనే దిగులు రైతులను వెంటాడుతోంది. గత యాసంగిలో సాగుచేసిన 52.60 లక్షల ఎకరాల్లో కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం పండినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ అందులో 71 లక్షల టన్నులు కొన్నట్లు పౌరసరఫరాల సంస్థ తాజాగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారులు కొన్నది పోను ఇంకా రైతుల వద్ద 20 లక్షల టన్నులకు పైగా ఉంటుందని అంచనా. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు ఎన్నో రోజులుగా అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. అది మరో 10 లక్షల టన్నులు ఉంటుంది. ‘కొనుగోలు కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయడం లేదు. గోనె సంచుల కొరతను పౌర సరఫరాల సంస్థ పట్టించుకోలేదు. కొన్నిచోట్ల వ్యవసాయ మార్కెట్లలో గోదాములు ఖాళీగా ఉన్నా ధాన్యం నిల్వలకు ఇచ్చేలా మార్కెటింగ్ శాఖ చొరవ చూపలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరు బయట కుప్పలు పోసిన ధాన్యమంతా వర్షాలకు తడిసి పాడవుతోంది’ అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గోనె సంచులేవి సారూ!
రాష్ట్రంలో కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, సేకరణకు 20 కోట్ల గోనె సంచులు అవసరమని పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. 19.85 లక్షలు కొత్తగా కొన్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ పలు కేంద్రాలకు అవి చేరకపోవడంతో ధాన్యాన్ని సకాలంలో కొనలేకపోతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి నెలా రేషన్ డీలర్లకిచ్చే 30 లక్షల బియ్యం సంచులను ఖాళీచేసి, వెనక్కి తీసుకుని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తామని చెప్పిన పౌరసరఫరాల సంస్థ అక్కడా వైఫల్యం చెందింది. మరోవైపు గోనె సంచుల కొనుగోళ్లు, సరఫరాలో మార్కెటింగ్ శాఖ..పౌరసరఫరాల సంస్థతో సమన్వయం చేసుకోలేకపోయింది. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లు దాదాపు పూర్తయినా, అక్కణ్నుంచి సంచులను అవసరమున్న ఇతర జిల్లాలకు పంపడంలో విఫలమైంది. కొన్ని కేంద్రాల వారు రాజకీయ ఒత్తిళ్లతో అవసరానికి మించి తీసుకోవడం కూడా మిగిలిన కేంద్రాల్లో కొరతకు కారణమయ్యాయనే విమర్శలున్నాయి.
లారీల కొరత తీర్చేదెవరు?
అవసరమైన మేరకు లారీలను సమకూర్చడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల వాహనాలు లేక 10 రోజులైనా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించలేని పరిస్థితి ఉంది. దీనివల్ల కొత్తగా అమ్మకానికి తెచ్చిన రైతులు అక్కడే పడిగాపులు పడుతున్నారు. లారీలు రాని కారణంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు, ఇసోజీపేట, గొంగ్లూరు వంటి గ్రామాల్లో వేల బస్తాల ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. ‘ప్రతి లారీని జీపీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ ఎక్కడ ఆలస్యమవుతుందో గుర్తించి, సమస్యను పరిష్కరించే చర్యల్ని కలెక్టర్లు తీసుకోవాలి. అది జరగడం లేదు. ఇది కూడా సమస్యకు ప్రధాన కారణం’ అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘నిజానికి లారీల కిరాయిని పౌర సరఫరాల సంస్థ చెల్లిస్తుంది. వాటిని తెప్పించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. దీంతో రైతులే యజమానులతో మాట్లాడుకుని లారీలు తెచ్చుకుంటున్నారు. బస్తాకు రూ.4 నుంచి 10 వరకూ సొంతంగా చెల్లిస్తున్నారు. ఇదంతా అక్రమ వసూలే. అయినా తప్పడం లేదు’ అని సంఘాలు వాపోతున్నాయి.
కూలీలు లేక...
కరోనా వ్యాప్తి పెరగడంతో రైసుమిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే కూలీల్లో కొందరు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దీనివల్ల తూకం వేయడం, మిల్లులకు చేరిన లారీల్లోని బస్తాలను దించడం వంటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా శివ్వంపేట కొనుగోలు కేంద్రంలో గతంలో 20 మంది హమాలీలు పనిచేసేవారు. ఇప్పుడు ఏడుగురే ఉన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా కలెక్టర్లపై బాధ్యతలు నెట్టేసి చేతులు దులుపుకుంది. అధికారులంతా కరోనాపై దృష్టిసారించడంతో ధాన్యం కొనుగోళ్లను పట్టించుకునే వారు కరవయ్యారు’ అని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.