తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహంలో విషాదం... మృత్యుపాశంగా మారిన గోడ... - LATEST CRIME NEWS IN TELANGANA

మేళతాళాల నడుమ వైభవంగా పెళ్లి జరిగింది. అంతా సంతోషంలో మునిగిపోయారు. అప్పుడే భోజనాలు ప్రారంభించారు. మరోవైపు వధూవరులు... బంధువుల ఆశీర్వాదాలు పొందేందుకు వేదికనెక్కారు. ఇంతలోనే అందరినీ ఉలిక్కిపడేలా చేసింది ఆ గోడ. అక్షతలు వేసేందుకు వచ్చిన ఆ బంధువులను విగతజీవుల్లా మార్చింది. పెళ్లి మంటపాన్ని ఏడుపులు పెడబొబ్బలతో మార్చి ఆ క్షణాన్ని ఓ పీడకలలాగా మార్చేసింది.

FUNCTION HALL WALL COLLAPSE IN GOLNAKA HYDERABAD OVERALL STORY

By

Published : Nov 11, 2019, 12:16 AM IST

వివాహంలో విషాదం... మృత్యుపాశంగా మారిన గోడ...
కోలాహలంగా వివాహం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కుప్పకూలిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ అంబర్​పేట​లోని గోల్నాకలో పెరల్ గార్డెన్స్​లో మహబూబ్​నగర్ అబ్బాయి, నర్సంబస్తీకి చెందిన అమ్మాయికి వివాహం జరుగుతోంది. సరిగ్గా పెళ్లి పూర్తయి అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో... వధూవరులను ఆశీర్వదించే మండపానికి సరిగ్గా వెనకనున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది.

ఆశీర్వదించే బంధువులే విగతజీవులుగా...

ఘటన సమయంలో ఐదుగురు అక్కడే ఉండగా... తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా... మిగితా వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతూ... మృతి చెందారు. మాజీద్ అనే యువకుడు ప్రస్తుతం వెంటిలేటర్​పై ఉన్నాడు. మృతుల్లో పెళ్లి కోసం వచ్చిన వారు, స్థానికులు ఉన్నారు. మృతులు విజయలక్ష్మీ(60), కృష్ణ(19), సురేష్(30), సోహైల్​గా గుర్తించారు. ఆశీర్వదించేందుకు వచ్చిన బంధువులు... ఈ ప్రమాదంలో మరణించటం పట్ల పెళ్లికూతురు తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లికొచ్చిన స్నేహితుడూ...

హైదరాబాద్​లోనే హార్డ్​వేర్​ పనిచేసుకుంటున్న కృష్ణ... స్నేహితుని వివాహానికొచ్చి ప్రమాదంలో మరణించాడు. కృష్ణ చనిపోయిన విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఆధారం లేకుండా నిర్మించడం వల్లే...

ఫంక్షన్​హాలుకు హర్షత్ యజమానిగా ఉండగా.. ఇజాజ్, నవాజ్ అనే వ్యక్తులు 15 ఏళ్లకు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. రెండు, మూడునెలలుగా పునరుద్ధరణ పనులు జరిగాయి. రినోవేషన్​​ అనంతరం జరిగిన మొదటి పెళ్లి ఇదేనని స్థానికులు చెబుతున్నారు. ఫంక్షన్ హాలు ఎలివేషన్ గోడను ఎటువంటి ఆధారం లేకుండా ఎత్తుగా కట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యజమాని పరారీలో ఉన్నాడని.. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీసీపీ రమేష్ తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం...

ప్రమాదంలో 10 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు ధ్వంసమవగా... నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల కుటంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ. రెండున్నర లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రకటించారు. ఫంక్షన్ హాలు యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

మృతదేహాలకు రేపు ఉదయం శవపరీక్ష జరపనున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాల బంధువులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు ఇళ్లతోపాటు... బంధువుల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి: ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details