‘కొంతకాలం కిందట... బ్రహ్మదేవుని ముంగిట... రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం... రూపురేఖలు వేరట... ఊపిరొకటే చాలట... ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం...’ అంటూ స్నేహబంధానికి ప్రాణం పోసిన సిరివెన్నెల పలుకులు అక్షరసత్యాలు... అందుకే ఆ వరం అందరికీ దొరకాలనీ ఆ స్నేహ మాధుర్యాన్ని అందుకోవాలన్న ఉద్దేశంతో దాని గుర్తుగా ఓ రోజు ఉండాలను కున్నాడు పరాగ్వేకి చెందిన ఆక్టర్ ఆర్టెమియో బ్రాచో. 1958 జులై 30న మిత్రుల్ని పిలిచి వేడుకలు జరిపించాడట కూడా. దీనికి ఐక్యరాజ్యసమితి సైతం ఆమోదముద్ర వేసింది. అమెరికన్ కాంగ్రెస్ మాత్రం ఆగస్టు తొలి ఆదివారాన్ని ‘మైత్రీ దినోత్సవం’గా ప్రకటించడంతో అనేక దేశాల్లో ఆ రోజునే ఉత్సవాలు జరుపుకోవడం, వాడుకలోకి వచ్చింది. కానీ దక్షిణ అమెరికాలో జులై 30వ తేదీనే ఈ వేడుకలు జరుపుకుంటారు. గ్రీటింగ్ కార్డుల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో హాల్‌మార్క్ సంస్థాపకుడైన జాయ్స్ హాల్ 1920ల్లోనే ఈ వేడుకకి శ్రీకారం చుట్టాడట. కారణమేదయితేనేం... బొకేలతో శుభాకాంక్షలు చెప్పుకోవడంతో మొదలైన ఫ్రెండ్‌షిప్ డే, నేడు ఎన్నో రకాల పర్సనలైజ్‌డ్ వస్తువుల్నీ ఫ్రెండ్‌షిప్ ప్లాంట్‌గా పిలిచే జేడ్ మొక్కనీ కానుకలుగా ఇచ్చిపుచ్చుకునే వేడుకగా మారిపోయింది.
అది... స్నేహితుల ఊరు!
స్నేహమే నా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నది ఆ నలుగురు స్నేహితులకీ బాగా అర్థమైనట్లుంది... తమ స్నేహం చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ తమకోసం ప్రత్యేకంగా ఓ చిన్న గ్రామాన్నే ఏర్పాటుచేసుకున్నారు. అమెరికాలోని ఆస్టిన్ శివార్లలోని లానో నది దగ్గర ‘లానో ఎగ్జిట్ స్ట్రాటజీ’ పేరుతో ఒకే వరసలో నాలుగు చిన్న ఇళ్లతోపాటు అందరూ కలిసి వండుకునేలా అక్కడే ఓ కమ్యూనల్ హోమ్‌నీ కట్టించు కున్నారట. ‘ఆస్టిన్ అమెరికన్ స్టేట్స్‌మన్’ పత్రికకి ఎడిటర్‌గా పనిచేసిన ఫ్రెడ్ జిప్, నగర జీవితంతో విసిగిపోయి స్నేహితులతో ప్రశాంతంగా గడపాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఇరవయ్యేళ్ల నుంచీ తనతోనే ఉన్న ప్రాణ స్నేహితులతో చెప్పగా అందరూ ఓకే అన్నారట. దాంతో వారాంతాల్లోనే కాకుండా రిటైరయ్యాక కూడా కలిసి జీవించేలా ఇళ్లను కట్టించు కోవాలనుకున్నారట. పచ్చని మొక్కల మధ్యలో నదికి దగ్గరగా ఉన్న ఓ ప్రదేశం నచ్చడంతో అక్కడ స్థలాన్ని కొని, కేవలం నాలుగు వందల చదరపు అడుగుల స్థలంలో చిన్న ఇళ్లను కట్టించుకున్నారట. వర్షం నీళ్లు ట్యాంకుల్లోకి వెళ్లేలా వీటిని డిజైన్ చేయించడంతో పర్యావరణప్రియుల్నీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నగా ముద్దుగా ఉన్న ఈ ఇళ్లు ‘బెస్టీ రో’గానూ ప్రాచుర్యం పొందాయి.
స్నేహంతోనే ఆరోగ్యం!
మంచి మిత్రుల వల్ల ఆనందంగానే కాదు, ఒత్తిడిపోయి మానసికంగానూ శారీరకంగానూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి తాజా పరిశీలనలు. స్నేహితుల ఆనందాన్ని కోరుకునేవాళ్లు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారట. 70 దాటాక కూడా స్నేహితులు ఎక్కువగా ఉండేవాళ్లు లేనివాళ్లకన్నా 22 శాతం ఎక్కువకాలం జీవిస్తున్నట్లు ఫ్లిండర్స్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
*కొందరు కొత్తవాళ్లతో త్వరగా కలిసిపోతారు. స్నేహం కుదిర్చేసుకుంటారు. కానీ ఎవరితోనైనా స్నేహం చేయడానికి కనీసం 50 గంటలైనా పడుతుందట. వాళ్లు మంచి స్నేహితులుగా మారడానికి కనీసం 200 గంటలయినా కావాలని సోషియాలజిస్టులు
చెబుతుంటారు. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లానే స్నేహానికీ ఓ కెమిస్ట్రీ ఉంటుంది. తొలి పరిచయంతోనే కొందరు స్నేహితులుగా మారడానికి అదే కారణమట. అంతెందుకు... పసివాళ్లు కూడా చేతులు చాచిన అందరి దగ్గరకూ వెళ్లరు. కొందర్ని చూసినప్పుడే నవ్వుతూ వెళతారు. అంటే- వాళ్లను చూడగానే కలిగిన భావమే స్నేహం. కాబట్టి స్నేహం కూడా ప్రేమ లాంటి భావోద్వేగమే అంటున్నారు చికాగో పరిశోధకులు.
*స్త్రీ-పురుషుల స్నేహం కొన్ని సందర్భాల్లో ప్రేమకీ పెళ్లికీ దారితీయడం తెలిసిందే. అయితే అది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చినదా అన్నది పక్కన పెడితే, అన్యోన్యంగా ఉండే జంటల్లో అంతర్లీనంగా ఉండేది గాఢ స్నేహమే అన్నది మరో పరిశోధన సారాంశం.
*‘నీవు లేక నేను లేను’ అన్నట్లు ఉండే స్నేహితుల డీఎన్‌ఏ ఒక శాతం ఒకేలా ఉంటుందట. అందుకే వాళ్ల ఆలోచనలూ అభిప్రాయాలూ దగ్గరగా ఉంటుంటాయి. అంతేకాదు, కొందరు స్నేహితుల జంటల్ని చూసినప్పుడు వాళ్లు అక్కాచెల్లెళ్లో అన్నాతమ్ముళ్లో అనిపిస్తుంటుంది. డీఎన్‌ఏలో సామ్యం కారణంగానే పోలికలు కూడా కలుస్తాయని యేల్ యూనివర్సిటీ పరిశీలనలు చెబుతున్నాయి.