తెలంగాణ

telangana

ETV Bharat / state

వారి మదిలో... నాటి సంగ్రామ జ్ఞాపకాలు

స్వాతంత్య్ర సంగ్రామంలో రావూరి కూటుంబం ఎన్నో పోరాటాలు చేసింది. క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్ర్య సమరంలో క్రియాశీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఒకవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు సాంఘిక దురాచారాలు విడనాడేలా, చైతన్యం కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.

old couple
old couple

By

Published : Aug 15, 2021, 5:42 AM IST

Updated : Aug 15, 2021, 6:45 AM IST

వారి మదిలో... నాటి సంగ్రామ జ్ఞాపకాలు

మీరు చూస్తున్న ఈ దంపతులే రావూరి అర్జున్ రావు, మనోరమ. ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైన ఈయన వయస్సు 102 ఏళ్లు. నూనుగు మీసాల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపు మేరకు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని స్వాతంత్య్ర కాంక్షను బలంగా చాటారు. పది నెలల పాటు మహాత్ముడితో అర్జున్‌రావు కలిసి పనిచేశారు. అప్పట్లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలు తగులబెట్టిన దగ్గర్నుంచి నేటి వరకు ఖాదీ వస్త్రాలనే ధరిస్తూ వస్తున్నారు. మైనర్ దశలోనే భర్త అర్జున్ రావుతో కలిసి స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్నారు మనోరమ. ప్రస్తుతం ఆమె వయస్సు 93 సంవత్సరాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లొచ్చారు.

స్వాతంత్య్ర ఉద్యమం మొదటి నుంచి

కృష్ణా జిల్లా గుడివాడ మండలం వానపాముల గ్రామానికి చెందిన రావూరి అర్జున్ రావు మొదటి నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేస్తోన్న గోపరాజు రామచంద్రరావుతో సారథ్యంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిసనలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లొచ్చారు. మహాత్ముడి పిలుపు మేరకు వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమంలో రాట్నం వడికి ఖాదీ బట్టలు నేయటం, సఫాయి కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం, స్వాతంత్య్ర సమరయోధుల కోసం వంటలు వండిపెట్టడం చేశారు.

12 ఏళ్ల వయసులోనే..

రావూరి అర్జున్ రావుతో పాటు ఆయన సతీమణి పన్నెండేళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. కుటంబంతో సహా అరెస్టు చేసి విజయవాడ సబ్ జైలుకు అక్కడి నుంచి అలీపూర్ క్యాంప్ జైలుకు తరలించారు. 10 నెలల జైలు జీవితాన్ని గడిపామని చెబుతారామె.

మహాత్ముడి చేతుల మీదుగా జరగాల్సినది..

మహాత్ముడి చేతుల మీదుగా జరగాల్సిన అర్జున్‌రావు-మనోరమ పెళ్లి.. గాంధీజీ మరణానంతరం.. అదే ఆశ్రమంలో భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1948 మార్చి 13న జరిగిన వీరి ఆదర్శవివాహాన్ని నెహ్రూ, వినోభాబావే, టక్కర్ బాబా, చమన్‌ లాల్‌, ప్రభాకర్ జీ దగ్గరుండి జరిపించారు.

పింఛన్​ సొమ్మును సామాజిక సేవకు

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తిరిగి విజయవాడ వచ్చి వయోజన విద్య కోసం పాటుపడటం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్య పర్చటం, కులాంతర, మతాంతర వివాహాలు చేయటం, హిందూ-ముస్లిం వైషమ్యాలు విడనాడేలా సహపంక్తి భోజనాలు నిర్వహించటం వంటి కార్యక్రమాలు చేశారు. గుడివాడలో పేదపిల్లల అభ్యున్నతి కోసం 1960లో హాస్టల్ ప్రారంభించి పాతికేళ్ల పాటు నిర్వహించారు. ప్రభుత్వమిచ్చే ‌పింఛన్​ సైతం సామాజిక సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తల్లిదండ్రుల పేరుతో మనోరమ అండ్ అర్జునరావు రావూరి పబ్లిక్ యుటిలిటి ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్య, వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ట్రస్ట్‌ను స్వయంగా సందర్శించిన అప్పటి రాష్ట్రపతి R. వెంకట్రామన్‌, మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే సేవలను అభినందించారు.

ఇదీ చూడండి:ప్రగతి ప్రస్థానంలో మనం ఎక్కడున్నాం?

Last Updated : Aug 15, 2021, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details