తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్రీ కరెంట్ హామీకి అంతమంది అర్హులా? ఎంత ఖర్చవుతుందో మరి? - ఉచిత కరెంట్ పథకం తెలంగాణ

Free Current Telangana 2024 : ప్రతి నెలా 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలపై విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆరా తీసింది. ఇంతకీ ఈ పథకానికి అర్హులు ఎంత మంది? అమలుకు ఎన్ని నిధులు ఖర్చవుతాయి?

Congress Govt Discussion on Solar Power Unit
TS Government Working on Free Electricity Supply

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 1:15 PM IST

Free Current Telangana 2024 :కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని, ప్రతి నెలా 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత మొత్తంలో ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్తు పంపిణీ సంస్థలను తాజాగా అడిగింది. ఈ నెల ఒకటో తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గృహావసర విద్యుత్తు కనెక్షన్లు 1,31,48,000 పైగా ఉన్నట్లు తేలింది. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడేవి 1.05 కోట్లు వరకు ఉన్నాయి.

ఈ కనెక్షన్ల నుంచి నెలనెలా కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు రూ.350 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ 1.05 కోట్ల ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు(Telangana DISCOM) రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్‌ కరెంటు సరఫరా నిమిత్తం సగటు వ్యయం(యావరేజ్‌ సప్లయ్‌ కాస్ట్‌-ఏసీఎస్‌) రూ.7.07 అవుతోంది. 200 యూనిట్లు వినియోగించేవారికి ప్రస్తుతం సగటు వ్యయం కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు.

Free Electricity Guarantee in Telangana 2024 : ప్రస్తుత వినియోగాన్ని బట్టి ఏడాదికి సుమారు రూ.4,200 కోట్ల వరకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఫ్రీ కరెంట్​ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనా. ఏసీఎస్‌ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. కొత్త బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించే నిధులను బట్టి ఏరకంగా ఇస్తారనే అంశంపై స్పష్టత వస్తుంది.

ఉచిత కరెంటు పొందే 1.05 కోట్ల ఇళ్ల వినియోగదారుల వివరాల నమోదుకు ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులోకి తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద చేరదలచిన వినియోగదారుల కరెంటు కనెక్షన్ల వివరాలన్నీ అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు సైతం నేరుగా పోర్టల్​లో నమోదు చేసుకునే అవకాశాన్ని కర్ణాటకలో కల్పించారు. అక్కడి ప్రభుత్వం గత ఆగస్టు నుంచి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ పథకం అమలు చేస్తోంది.

గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది : డిప్యూటీ సీఎం భట్టి

అదే తరహాలో ఇక్కడా అమలుకు ప్రాథమికంగా విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. విద్యుత్​ పోర్టల్‌లో వినియోగదారుడి కరెంటు కనెక్షన్‌(Electricity Connection) వివరాలు నమోదు చేయగానే గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున ఎన్ని యూనిట్లు వాడారో తెలుస్తుంది. అదే సగటు ప్రకారం కర్ణాటకలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నారు. అదే పద్ధతిని తెలంగాణలోనూ పాటించాలా లేదా 200 యూనిట్లు వాడే 1.05 కోట్ల మంది వినియోగదారులందరికీ ఇవ్వాలా అన్నదానిపై కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Congress Free Electricity Guarantee :నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు వినియోగించే గృహావసర కనెక్షన్లు అన్నింటికీ సౌర విద్యుత్తు సదుపాయం కల్పిస్తే ఏటా రాయితీ పద్దు కింద విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.4,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉండదనే చర్చ కూడా సాగుతోంది. అయితే సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు దాదాపు రూ.10 వేల కోట్ల ఖర్చు కావచ్చని అధికారవర్గాల అంచనా. రెండు కిలోవాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్తు యూనిట్‌ ఏర్పాటు చేస్తే ఏడాదికి 2,880 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తేలింది.

త్వరలో నూతన విద్యుత్ విధానం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రస్తుత ధరల్లో రెండు కిలోవాట్ల సౌర విద్యుత్తు ఏర్పాటుకు రూ.1.30 లక్షలు ఖర్చవుతుందని, ఇందులో కేంద్రం రూ.36 వేలు రాయితీగా ఇస్తుందని అధికారులు తెలిపారు. ఈ రాయితీ మినహా మిగిలిన రూ.94 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించి.. ప్రతి కనెక్షన్‌కూ సౌర విద్యుత్తు ఏర్పాటు చేసే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2,880 యూనిట్లకుగాను ప్రస్తుతం డిస్కంకు చెల్లిస్తున్న ఛార్జీలను లెక్కిస్తే ఏడాదికి రూ.12,235 అవుతుంది.

ఈ లెక్కన దాదాపు ఏడున్నరేళ్లలో ఒక్కో సౌర విద్యుత్తు యూనిట్‌ ఏర్పాటుకు వెచ్చించిన రూ.94 వేలు ప్రభుత్వ ఖాతాలోకి తిరిగివచ్చేసినట్టేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుందనేదే కీలక ప్రశ్నగా మారింది.

ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!

200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి : పాయల్ శంకర్

ABOUT THE AUTHOR

...view details