తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ..? - డిగ్రీ ప్రత్యేక కోర్సులు

కొత్త కోర్సుల కోసం ఉన్నతవిద్యామండలి కసరత్తు చేస్తోంది. డిగ్రీలో మూడేళ్ల చదువు తర్వాత ఏడాది పాటు స్పెషలైజేషన్‌ అందిస్తే ఎటువంటి సమస్య ఉండదని యోచిస్తోంది. ఒక అంశంపై విద్యార్థులు లోతైన పరిజ్ఞానం కూడా పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

four years honours degree in telangana
నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ?

By

Published : Mar 11, 2020, 10:52 AM IST

వచ్చే విద్యా సంవత్సరం బీఎస్సీలో డేటా సైన్స్‌...బీకాంలో బిజినెస్‌ అనలిటిటెక్స్‌ అనే కోర్సులను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వాటిని నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సుగా మార్చే అవకాశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ రెండు కొత్త కోర్సులపై ఇప్పటికే నిపుణులతో కమిటీని నియమించి మూడు సార్లు చర్చించింది. మూడేళ్ల డిగ్రీ కావడం వల్ల విదేశీ విద్యకు ఇబ్బంది అవుతుందని, ఆనర్స్‌ పేరిట నాలుగేళ్ల డిగ్రీ చేస్తే బాగుంటుందని కళాశాలల యాజమాన్యాల నుంచి ప్రతిపాదన వచ్చింది. అమెరికాలో ఎంఎస్‌ చేయాలంటే 16 సంవత్సరాలు చదివి ఉండాలి. బీఎస్‌సీ మూడేళ్లు ఉంటే అప్పుడు ఒకటో తరగతి నుంచి పరిగణనలోకి తీసుకుంటే 15 సంవత్సరాల విద్యే అవుతుంది.

నాలుగో ఏడాదిలో పరిశోధన చేస్తే...

గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సుగా మారిస్తే యూజీసీ అంగీకరించలేదు. జాతీయ నూతన విద్యా విధానంలో మాత్రం ఎగ్జిట్‌ ఆప్షన్‌పై నాలుగేళ్ల డిగ్రీ ప్రవేశపెట్టాలని ప్రతిపాదన ఉంది. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత మానేస్తే సర్టిఫికెట్‌, రెండేళ్ల తర్వాత డిప్లొమా, మూడేళ్ల తర్వాత డిగ్రీ సర్టిఫికెట్‌ ఇస్తారు. నాలుగో ఏడాదిలో పరిశోధన చేస్తే పీహెచ్‌డీలో ప్రవేశించే విధానాన్ని తీసుకురానున్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి కూడా నాలుగేళ్ల డిగ్రీ, అయిదేళ్ల బీటెక్‌ను ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే సమస్య ఉండదు.

ఓ అంశంపై లోతైన పరిజ్ఞానం

వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని కొత్త కోర్సులపై నియమించిన కమిటీ యోచిస్తోంది. నాలుగేళ్ల విద్య కోసం మూడేళ్ల తర్వాత అదే కళాశాలలో వివిధ స్పెషలైజేషన్లలో ఏడాదిపాటు పీజీ డిప్లొమా కోర్సు అందిస్తే ఎటువంటి సమస్య ఉండదని, ఒక అంశంపై లోతైన పరిజ్ఞానం కూడా పొందొచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో దీనిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

ఇవీ చూడండి:ఈనాడు జర్నలిజం స్కూల్​ నోటిఫికేషన్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details