నూతన సచివాలయ, శాసనసభ భవన నిర్మాణాలకు అంకురార్పణ జరిగింది. ప్రస్తుత సచివాలయం సముదాయంలోనే కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సచివాలయంలోని డీ బ్లాక్ వెనక ఉన్న ఉద్యానవనంలో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సీఎం కేసీఆర్ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ప్రస్తుతం సచివాలయం 25 ఎకరాల్లో ఉండగా...దాన్ని 30 ఎకరాలమేర విస్తరించనున్నారు. ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో చివరి సారిగా 2017 ఫిబ్రవరి రెండో తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశం కోసం సచివాలయానికి సీఎం కేసీఆర్ వచ్చారు. అప్పట్నుంచి పూర్తిగా ప్రగతి భవన్ వేదికగానే ముఖ్యమంత్రి కార్యకలాపాలు కొనసాగాయి. కేబినెట్ సహా అన్ని రకాల సమావేశాలు, సమీక్షలను ప్రగతి భవన్ లోనే నిర్వహించారు. తాజాగా ఇవాళ నూతన సచివాలయ భవన భూమి పూజ కోసం సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చారు.
రూ.100 కోట్లతో కొత్త అసెంబ్లీ..!
కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన - తెలంగాణ నూతన అసెంబ్లీ నిర్మాణం
నూతన అసెంబ్లీ, సచివాలయ భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. పాత సచివాలయ సముదాయంలోనే నూతన సచివాలయం, ఎర్రమంజిల్లో శాసనసభ నిర్మాణాలు చేపట్టనున్నారు.
సచివాలయం శంకుస్థాపన తర్వాత నూతన శాసనసభ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కార్యాలయం సముదాయం వద్ద ఉదయం 11 గంటలకు భూమి పూజ అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ రోడ్లు భవనాల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కార్యాలయం సముదాయం మొత్తాన్ని తిరిగి పరిశీలించారు. ఎర్రమంజిల్‌లోని పురాతన భవన స్థానంలో అసెంబ్లీ, కౌన్సిల్ సహా సెంట్రల్ హాల్ ఉండేలా కొత్త భవనాన్ని నిర్మిస్తారు. ప్రస్తుత అసెంబ్లీ చారిత్రక భవనం నమూనాలోనే కొత్త శాసనసభ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. అసెంబ్లీ భవన నిర్మాణం కోసం వంద కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా.
ఇవీ చూడండి:కంటోన్మెంట్లో 10 లక్షల మందికి ఇబ్బందులు: రేవంత్రెడ్డి