నేను కేటీఆర్ సార్..పీఏ తిరుపతి రెడ్డి అని..నా మంచి చెడు చూసుకోండి.. అడ్వాన్స్ పంపించండి అంటూ పలువురికి ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు వసూలు చేసిన నాగరాజును పోలీసులు కటకటాలకు పంపించారు. ఆయన లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధుల పేరుతో నాగరాజు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడన్న సమాచారంతో ఇన్ స్పెక్టర్ మోహన్ రావు బృందం అతడిని ప్రశ్నిస్తోంది. మరింత లోతైన సమాచారం కోసం నాగరాజు నేరచరిత్రపై వివరాలు తెలుసుకునేందుకు కోర్టు అనుమతితో పోలీసులు విచారణ చేస్తున్నారు. నాగరాజు వ్యవహరంలో హైదరాబాద్ కేంద్రంగా బయో టెక్నాలజీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థకు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యవహారంలో నాగరాజు లీలలు బయటకు వచ్చాయి.
క్లబ్బుల్లో, పబ్బుల్లో జల్సాలు
గతేడాది నవంబర్ లో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి స్కార్పియో వాహనం, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని మోసం చేయగా వచ్చిన డబ్బుతో నాగరాజు ఒక్కడే జల్సాలు చేశాడని బ్యాంకాక్, గోవాకు వెళ్లే వాడని, అతడి వద్ద ఉన్న విమాన టికెట్‌ను పోలీసులు గుర్తించారు. జల్సాల కొరకు నాలుగు నెలల వ్యవధిలో పలుమార్లు బ్యాంకాక్, గోవాకు వెళ్లి పేకాట క్లబ్బులు, పబ్బుల్లో మద్యం సేవించేవాడని పోలీసులు పేర్కొన్నారు.