తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ప్రాణాలు పణంగా పెట్టి సహాయక చర్యలు - ప్రాణాలే ఫణంగా పెట్టిన అగ్నిమాపక శాఖ అధికారులు

Secunderabad Fire Accident Update: ఒకటి కాదు రెండు కాదు... 22 శకటాలతో రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేసేందుకు... ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారు. సాహసోపేతంగా వ్యవహరించి అగ్నికీలల్లో చిక్కుకున్న అయిదుగురిని సురక్షితంగా కాపాడారు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా.. అగ్నిమాపక శాఖ అధికారితో పాటు ఆయన డ్రైవర్‌ అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. సహాయ చర్యలు చేపట్టిన మరికొంత మంది సిబ్బంది... దట్టంగా అలుముకున్న పొగ కారణంగా మసి బారిపోయారు.

Secunderabad Fire Accident
Secunderabad Fire Accident

By

Published : Jan 20, 2023, 6:46 AM IST

Updated : Jan 20, 2023, 7:43 AM IST

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ప్రాణాలు పణంగా పెట్టి సహాయక చర్యలు

Secunderabad Fire Accident Update: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద సంఘటనలో సహాయ చర్యల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఫైర్‌మెన్‌ దగ్గర నుంచి జిల్లా, ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారులు... అగ్నిమాపక శాఖ డీజీ వరకు ఇలా... సుమారు 100 మంది రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే.. మరికొంత మంది అధికారులు, సిబ్బంది భవనంలోనికి కూడా వెళ్లి వచ్చారు. దట్టమైన పొగల మధ్య అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది... బ్రాంటో స్కై లిఫ్ట్‌ వాహనం ద్వారా భవనం పై కప్పు పై ఉన్న ముగ్గురిని సురక్షితంగా కిందకు దించారు. భవనం నాలుగో అంతస్తులో మరో ఇద్దరు ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది... వారిని ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న బిల్డింగ్‌ నుంచి సమాంతరంగా నిచ్చెన వేసి కాపాడారు.

ఎవరి ఆచూకీ లభించలేదు: మరో ఇద్దరు లోపల ఉన్నట్టు భవనం యజమాని అనుమానం వ్యక్తం చేయడంతో... వారిని కాపాడేందుకు సిబ్బంది ఊపిరి తీసుకోలేనంతగా దట్టమైన పొగల మధ్యలోకి వెళ్లారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, ప్రత్యేక మాస్కులు ధరించి భవనంలోనికి వెళ్లారు. మొత్తం ఐదంతస్తులతో పాటు... పెంట్‌ హౌజ్‌లో అనువనువూ గాలించారు. భవనం అద్దాలు పగలగొట్టి క్షుణంగా గాలించినప్పటికీ.. ఎవరి ఆచూకీ లభించలేదు. దట్టమైన పొగలో సహాయ చర్యల్లో పాల్గొన్న జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి ధనుంజయ్‌ రెడ్డి... సిబ్బంది నర్సింగ్‌రావు... తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరిని అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే టైర్లు, రెక్సీన్‌ సామాగ్రి, రసాయనాలు, రంగులు వంటివి... అధిక శాతం భవనంలో నిల్వ చేయడం వలనే మంటలు వేగంగా తీవ్రంగా వ్యాపించాయని... అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

అదుపు చేసే క్రమంలో అనేక సవాళ్లు:జీహెచ్​ఎంసీ పరిధిలోని అన్ని అగ్నిమాపక కేంద్రాలకు చెందిన... 22 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాటి ద్వారా సుమారు 9 గంటల పాటు శ్రమించి మంటలను అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే డెక్కన్‌ స్పోర్స్ట్‌ దుకాణంలో... రెక్సీన్‌ సామాగ్రి, టైర్లు సెల్లార్‌, మొదటి అంతస్తులో నిల్వ చేయడంతో... మంటలు తీవ్రత ఎక్కువయ్యిందని... అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మిగతా అంతస్తులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. మంటలను అదుపు చేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి... అనేక సవాళ్లు ఎదురయ్యాయి.

దట్టమైన పొగను దాటుకొని భవనంలోనికి వెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి వేగంగా చేరుకున్నప్పటికీ... మంటలు వ్యాపించిన సమీప భవనాల వద్దకు... ఇరుకు ప్రాంతాల్లో వెళ్లడానికి పడరాని పాట్లు పడ్డారు. అగ్నిమాపక శకటాలు బస్తీల్లోకి వెళ్లకపోవడంతో మంటలు ఆర్పేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరో వైపు ఒక దశలో పొగలు వ్యాపించడం తగ్గినట్టే తగ్గి... ఒక్కసారిగా పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ పరిస్థితిని అగ్నిమాపక శాఖ అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడి ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. దీంతో మరింత వ్యయ ప్రయాలకు ఓర్చి.. మంటలను మళ్లీ అదుపులోకి తీసుకువచ్చారు. మొత్తంగా అగ్నిమాపక శాఖ అధికారులు... తీవ్రంగా శ్రమించారనే చెప్పవచ్చు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 20, 2023, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details