తనతో వ్యక్తిగత వివాదం ఉన్న వ్యక్తి నుంచి భారీగా డబ్బు గుంజేందుకు పెద్ద ప్లానే వేశారు.. దుర్గారెడ్డి అండ్ బ్యాచ్. ఓ మహిళను ఎరగా వేసి భారీగా డబ్బులు దండుకునేందుకు సిద్ధమయ్యారు. దానిలో విజయవంతం అయ్యారు. అయితే ఈ ముుఠా గుట్టును..రట్టు చేశారు.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు...!
తూగో జిల్లా మామిడాడకు చెందిన మణికంఠరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. కాకినాడకు చెందిన దుర్గారెడ్డి ఓ ప్రైవేట్ ఛానల్ నడుపుతున్నాడు. వారిద్దరి మధ్య స్థలవివాదాలున్నాయి. ఎలాగైనా మణికంఠరెడ్డిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో దుర్గారెడ్డి, రాజేష్ అనే వ్యక్తులు పథకం రచించారు. ముఠాలోని ఒక వ్యక్తి భార్యను మణికంఠరెడ్డికి పరిచయమయ్యేలా చరవాణి, సందేశాలను ఆమెతో చేయించారు. ఈ క్రమంలో మణికంఠరెడ్డి, ఆ మహిళ మధ్య పరిచయం పెరిగింది. ఈనెల ఏడోతేదీన సామర్లకోటలోని మడికి అశోక్ అనేవ్యక్తి ఇంటికి మణికంఠరెడ్డిని రప్పించారు. ఆ ఇంట్లో మహిళతో మణికంఠరెడ్డి ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని ఫొటోలు, వీడియోను ముఠా సభ్యులు తీశారు. ఆతర్వాత గదిలోకి ప్రవేశించి మణికంఠరెడ్డిని కుర్చీకి కట్టేసి కొట్టి రూ.25 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేసి అతని వద్ద ఉన్న రూ. 63 వేల నగదు, బంగారు గొలుసు, బ్రాస్లెట్, ఉంగరాలను లాక్కున్నారు. ప్రాంసరీ నోట్లు, తెల్ల కాగితంపై సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. ఈ విషయమై బాధితుడు మణికంఠరెడ్డి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.