Taraka Ratna Health Updates: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. జనవరి 28న ఆయనను ఏపీలోని కుప్పం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. హృద్రోగంతో పాటు, నాడీ (న్యూరో) సమస్యలకు ఆ వైద్యులు చికిత్స చేస్తున్నారు.
అసలేం ఏం జరిగిందంటే : ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది.. కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.