తెలంగాణ

telangana

ETV Bharat / state

Grain Purchase Issues: వణుకుతున్న రైతులు.. నిద్దరోతున్న అధికారులు - రైతుల ఇబ్బందులు

అందరికి అన్నం పెట్టే రైతునే.. అన్నమో రామచంద్రా అనిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలి.. ఎటు చూసినా చిమ్మచీకట్లు.. మధ్యలో భౌ.. భౌమంటూ భయపెట్టే ఊరకుక్కలు.. పారాడే విషకీటకాలు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కర్షకులు అరిగోస పడుతున్నారు. మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అటవీ జంతువులు- దొంగల పాలవ్వకుండా రాత్రిపూట ఆరోగ్యాన్ని లెక్కచేయక కాపాలాకాస్తున్నారు. సమయానికి తిండి లేక.. కంటి నిండా నిద్ర కరవై.. అనారోగ్యం పాలై ప్రాణాలు పోతున్నా ఆదుకునేవారు లేరు. మంగళవారం రాత్రి కొనుగోలు కేంద్రాల్లో పరిశీలన చేయగా.. వారుపడుతున్న అవస్థలు కంటతడి పెట్టించాయి.

Grain Purchase Issues
ఎముకలు కొరికే చలిలో పడిగాపులు

By

Published : Nov 11, 2021, 8:22 AM IST

నాపేరు గెల్ల మహేశ్, అడ్లూర్‌ గ్రామం. నాకున్న రెండెకరాల్లో వరి సాగు చేశా. పంట కోసి ధాన్యాన్ని అమ్మకానికి రెండు రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తెచ్చా. అప్పటి నుంచి కుప్ప వద్ద కాపలా ఉంటున్నా. కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు లేవు. రాత్రి పూట ధాన్యాన్ని కాపాడుకోవడానికి భయంభయంగా గడపాల్సి వస్తోంది. నిర్వాహకులు తమకు సంబంధం లేదంటున్నారు. రోజురోజుకు చలి పెరుగుతోంది. త్వరితగతిన కాంటాలు పూర్తి చేసి ఆదుకోవాలి.

-గెల్ల మహేశ్, రైతు

కాసులు వారికి.. కష్టాలు వీరికా..?

కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసిన తరువాత వాటి బాధ్యత నిర్వాహకులదేనని నిబంధనలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 13 ప్రకారం కొనుగోలు కేంద్రాలు ధాన్యం సంచులు తూకం వేయగానే రైతులకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కింటాకు రూ.32 చెల్లిస్తోంది. ఈ డబ్బులను దర్జాగా జమ చేసుకొని బాధ్యతలను గాలికొదిలేశారు. ప్రశ్నించాల్సిన అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారు.

మంచుకు నిద్రపట్టడం లేదు

నా పేరు బొంబోతుల భైరాగౌడ్‌. గర్గుల్‌ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి పక్షం రోజులవుతున్నా పరేషాన్‌ తప్పడం లేదు. మూడెకరాల్లో పండించిన వరిని కాపాడుకునేందుకు నిత్యం కళ్లల్లో వత్తులేసుకొని కాపాడుకుంటున్నా. ఎన్ని దుప్పట్లు కప్పుకొన్నా చలి ఆగడం లేదు. నిద్ర పట్టడం లేదు. ధాన్యం తీసుకెళ్లేదెప్పుడో.. నా కష్టం తీరేదెప్పుడో..!

-బొంబోతుల భైరాగౌడ్, రైతు

నిబంధనలు నీటి మీది రాతలే..

కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని కనీసం నాలుగు రోజుల్లోపు కొనుగోలు చేయాల్సి ఉండగా 10 నుంచి 15 రోజులైనా కాంటాలు వేయడం లేదు. అధికారుల ప్రణాళికా లోపమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయిదు రోజుల క్రితం లింగంపేట కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్‌కు చెందిన రైతు బీరయ్య జాప్యం కారణంగానే అనారోగ్యానికి గురై మృతి చెందారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం సాధారణ మరణమేనని చెప్పుకొస్తున్నారు. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో మాత్రం ‘చలి’నం కనిపించడం లేదు.

చలిలోనూ చెన్నీ

  • కామారెడ్డి మండలం అడ్లూర్‌, గర్గుల్‌, సరంపల్లి, రామేశ్వర్‌పల్లి, లింగాపూర్‌, మాచారెడ్డి మండలం ఇసాయిపేట, పాల్వంచ, తాడ్వాయి, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాత్రి వేళ పరిశీలించగా రైతులు చలికి వణుకుతూ కనిపించారు.
  • మరికొందరు జాగరణ చేస్తూ.. తరుగు పేరిట దగా నుంచి తప్పించుకోవడానికి ధాన్యాన్ని చెన్నీ పడుతున్నారు.
  • తూకం వేసిన ధాన్యం బస్తాలు దొంగతనానికి గురవ్వకుండా గస్తీ తిరుగుతున్నారు.
  • ఆరబోసిన ధాన్యం మంచుకు తడవకుండా పరదాలు కప్పుతూ కనిపించారు.
  • చలి నుంచి రక్షణ పొందేందుకు రకరకాల పాట్లు పడుతూ తెల్లవార్లు గడిపారు.

నిర్వాహకులు చెప్పడంతోనే : సందీప్‌, గర్గుల్‌, రైతు

పది రోజుల క్రితం తెచ్చిన ధాన్యాన్ని ఈ నెల 9న కాంటా పెట్టారు. అయినా సంచుల బాధ్యత నీదేనని నిర్వాహకులు చెప్పడంతో చలిలో కాపలా కాస్తున్నా. కాంటాలు వేసిన సంచులు కావడంతో ఎవరైనా ఎత్తుకెళ్తారని భయమేస్తోంది. వడ్లు తెచ్చింది మొదలు.. అమ్మినా కాపలా కష్టాలు తప్పడం లేదు.

అమ్మినా.. అష్టకష్టాలే : ఎంకొల్ల రంజిత్‌, అడ్లూర్‌
కొనుగోలు కేంద్రానికి అక్టోబరు 26న ధాన్యం తీసుకొస్తే ఎట్టకేలకు ఈ నెల 8న తూకం వేశారు. ధాన్యం అమ్మిన తరువాత కూడా బస్తాలకు కాపలా కాయాల్సి వస్తోంది. సంచులను తరలించేందుకు లారీల కొరత ఉందంటున్నారు. రెండ్రోజులుగా నిత్యం ఆటోలో వచ్చి బిక్కుబిక్కుమంటూ పడుకుంటున్నా.

ఇదీ చూడండి:మంత్రి ప్రారంభించి 5 రోజులవుతున్నా.. ప్రారంభం కాని కొనుగోళ్లు

TRS Dharna: ఎల్లుండి ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోండి: కేటీఆర్‌

Rice Millers Association: 'ప్రతిగింజా కొంటామంటూనే.. ఏర్పాట్లు చేయట్లేదు!'

Grain purchase issue: పెరగని మిల్లింగ్ సామర్థ్యం.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

paddy procurement in telangana: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details