Paddy Procurement Issues in Telangana : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరును నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల రైతులు నిరసనలకు దిగారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. వడ్ల సేకరణలోనూ తరుగు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
TS Farmers Protest for Paddy Procurement : సూర్యాపేట-మహబూబాబాద్ రహదారిపై రైతుల ఆందోళనతో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.... ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు. అధికారుల తీరు మారకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలంటూ... నల్గొండ జిల్లా శాలిగౌరారం ఐకేపీ కేంద్రం వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు బస్తాకు 3కిలోల చొప్పున ధాన్యం తగ్గిస్తున్నారని ఆరోపించారు.
Paddy Procurement in Telangana : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. నానా అవస్థలు పడి పండించిన పంటను తరలించేందుకు సరిపడా లారీ ఇవ్వకపోవటంతో ధాన్యం మిల్లులకు చేర్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్‌లో రైతులు వడ్ల బస్తాలకు నిప్పుపెట్టారు. లారీల కొరతతో 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు నిలిచిపోయాయని వాపోయారు. తేమ పేరుతో క్వింటాలుకు ఐదు నుంచి ఏడు కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.
వర్షం నీరు.. రైతు కంట కన్నీరు :ఈ ఏడాది వేసవిలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురవడంతో చేతికందొచ్చిన పంట నేలపాలైంది. కోతలు కోసే సమయంలోనే వానలు ఇబ్బడిముబ్బడిగా కురవడంతో సగం పంట చేనులోనే నేలపాలైంది. మిగిలిన సగం పంటనైనా అమ్ముకుందామని మార్కెట్లోకి తెచ్చిన పంటలు కురిసిన వానలకు కొట్టుకుపోయింది. పంట పొలాలలోను, ఆరబోసిన కళ్లాలలోను కురిసిన వానలకు పంట అంతా కొట్టుకుపోయింది. ఇలా అన్ని రకాలుగా రైతులు నష్టపోయారు. మిగిలిన కొద్దో గొప్పో పంటను అయినా అమ్ముకుందామంటే డీలర్లు రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంటను కొనాలని సూచించినప్పటికీ డీలర్లు మాత్రం కొనుగోలు విషయంలో జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: