Tomato Grading Machine: ఒకసారి పంట నష్టపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజులివి.. వచ్చిన దిగుబడికి ధర లభించకపోతే రవాణా ఖర్చులు భరించలేక రోడ్లపైన పారబోసే దుస్థితి.. నష్టాన్ని చవిచూసిన పంటను మరోసారి వేయకుండా ప్రత్యమ్నాయ సాగుకు మొగ్గుచూపే పరిస్థితి.. ఇలాంటి సమయంలోనూ పంట పండించడంలోని సమస్యల నుంచి విముక్తి పొందాలని ఆలోచించాడు ఓ రైతు. అందుకే తానే స్వయంగా యంత్రాన్ని తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు..
Grading Machine for Tomato: ఏపీ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన గవిని హరికృష్ణ పదో తరగతి చదివాడు. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. టమాటా పండించే హరికృష్ణకు తరచూ గ్రేడింగ్, మార్కెటింగ్ విషయంలో సమస్యలు ఎదురయ్యేవి. ఎంత మంచి పంట మార్కెట్‌కు తీసుకెళ్లినా.. అక్కడక్కడా ఉన్న చిన్న కాయలను చూపి వ్యాపారులు ధర తగ్గించేవారు. కూలీలతో గ్రేడింగ్ చేయించి తీసుకెళ్లినా.. ఒక్కో డబ్బాకు రెండు, మూడు కిలోలు తగ్గించి డబ్బులిచ్చేవారు. తాను నష్టపోతున్నానని తెలిసినా హరికృష్ణకు వేరే మార్గం లేక సతమతమయ్యేవాడు.
అంత ధర పెట్టలేక తానే సొంతంగా
Tomato Grading Machine: రెండేళ్ల క్రితం హరికృష్ణ ఉద్యానశాఖ అధికారులతో కలిసి బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ పెద్ద మాల్ నిర్వాహకులు టమాటాలను యంత్రంతో గ్రేడింగ్ చేయటం చూశాడు. పెద్దకాయలకు అధిక ధర వస్తున్న విషయం గమనించారు. మార్కెట్లో అలాంటి యంత్రం ధర రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉంది. అంత ధర పెట్టలేక.. యూట్యూబ్ వీడియోలు చూసి తానే సొంతంగా యంత్రాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. మొదట్లో చిన్నచిన్న పొరపాట్లు చేసినా చివరకు అనుకున్నది సాధించాడు.