ఈసారి పత్తి పంటనే 70 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలనేది వ్యవసాయశాఖ లక్ష్యం. దీంతో అన్ని గ్రామాల్లో ఈ విత్తనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒక ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్ల చొప్పున ఈ సీజన్‌లో కోటిన్నర ప్యాకెట్లను విక్రయించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీటీ పత్తి విత్తనాలను 450 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి ప్యాకెట్‌ను రూ.810కి మాత్రమే అమ్మాలి. కానీ, తక్కువ ధరకే అంటూ ‘విడి’(లూజ్)గా కిలోల చొప్పున పలు గ్రామాల్లో వ్యాపారులు పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. పత్తి విత్తన పంటను ఏడాది ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు కంపెనీలు అధికంగా సాగుచేయించాయి. అందులో నాసిరకం అని కంపెనీలు కొనకుండా తిరస్కరించిన విత్తనాలను వ్యాపారులు బస్తాల్లో నింపి గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లోని భగీరథ కాలనీలో ఏకంగా 5 బస్తాల బీటీ పత్తి విత్తనాలను పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇప్పటికే ఇలా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో సైతం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో రూ.57 లక్షల విలువైన 49.23 క్వింటాళ్ల నాసిరకం, నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. 22 మందిని అరెస్టు చేసి వారిపై 11 కేసులు పెట్టారు.
పత్తి విత్తనాలను 450 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి మాత్రమే విక్రయించాలని వ్యవసాయశాఖ నిబంధనలున్నాయి. అందుకు విరుద్ధంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో టాస్క్‌ఫోర్స్ బృందం ఇలా విడి పత్తి విత్తనాలు అమ్ముతుండగా స్వాధీనం చేసుకుంది.
ఏపీ, కర్ణాటక నుంచి
పత్తి, మిరప వంటి పంటల విత్తనాలు ప్రధాన కంపెనీల పేరుతో ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి బీటీ పత్తి, మిరప విత్తనాలు ఎక్కువగా తెచ్చి విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. ఇక మిరప, ఇతర కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలకు సంకరజాతి విత్తనాలను ప్రైవేటు కంపెనీల నుంచే తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి. వాటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున నాసిరకం, ప్రధాన కంపెనీల బ్రాండ్ల పేరుతో నకిలీవే అధికంగా అమ్ముతున్నారు.