Spurious Seeds In Telangana :రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముంగిట విత్తన దందాకు అడ్డుకట్టపడటం లేదు. ఈ ఏడాది వానా కాలం సాగు విస్తీర్ణం కోటి 30 లక్షల ఎకరాలు. తెలంగాణలోకి జూన్ మొదటివారంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. మరోవైపు ఇప్పటికే పొలాన్ని సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణం ఆశాజనంగా ఉంటుందన్న ఆశలతో అనేకమంది పత్తి రైతులు పొలాల్లో విత్తనాలునాటారు. కాగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రతకు అవి మొలకెత్తడం లేదు. దీంతో మళ్లీ విత్తనాలు నాటేందుకు సిద్ధమౌతున్నారు. మరోవైపు ఈ ఖరీఫ్ సీజన్‌లో పత్తి విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో విత్తనాలకు అమాంతం గిరాకీ పెరిగిపోయింది. దీన్నే ఆసరాగా తీసుకుని కొందరు డీలర్లు, వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
Fake Cotton Seeds Sale In Telangana :నకిలీ విత్తనాల దందా ఏటా కొనసాగుతున్నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖల ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు క్షేత్రస్థాయి అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు తెరలేపారు. అధిక ధరలకూ అమ్ముతున్నారు. ఒక విత్తన ప్యాకెట్‌కు 2500 రూపాయలు వసూలు చేస్తుండటం పత్తి రైతులకి ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 1 నుంచి వ్యవసాయ శాఖకు 3 వేలపైగా ఫిర్యాదులు అందడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
'గత నాలుగైదు సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతానికి పైగా పత్తి రైతులే ఉంటున్నారు. వారు ప్రధానంగా చెబుతున్న సమస్య విత్తనం సరిగ్గా మొలకెత్తడం లేదని.. లేదా..రెండు ప్యాకెట్లు వేయాల్సిన చోట నాలుగు ప్యాకెట్లు వేయాల్సి వస్తుందని అంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి కుటుంబం సమస్య ఇదే. ముఖ్యంగా కౌలు రైతులకు మరీ పెద్ద సమస్య.. పెట్టుబడులు పెట్టడమే కాకుండా.. విత్తనాలు కూడా అప్పులు చేసి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం నుంచి వారికి రైతుబంధు కానీ బ్యాంక్ రుణాలు లాంటి సౌకర్యాలు ఉండవు'. - బన్నూరు కొండల్ రెడ్డి, ప్రతినిధి, రైతు స్వరాజ్య వేదిక
Fake Cotton Seeds In Telangana :వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు కావాలి. 450 గ్రాములుండే ప్యాకెట్‌ను 853 రూపాయలకు విక్రయించాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఊరూపేరూ లేని కంపెనీలు, డీలర్లు, వ్యాపారులు ఏజెంట్ల సాయంతో గ్రామాల్లో తిరుగుతూ వెయ్యి నుంచి 2500 రూపాయల వరకు యథేచ్ఛగా విక్రయిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.
ఇలానే వరంగల్ జిల్లా కేంద్రంగా నాసిరకం విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలను టాస్క్‌ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.2.11 కోట్ల, 7 టన్నుల విడి విత్తనాలు, 9 వేల 765నాసిరకం విత్తన ప్యాకెట్లు, డీసీఎమ్ వ్యాన్, కారు, రూ.21 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో హెచ్‌టీ పత్తి విత్తనాలు దందా పెద్దఎత్తున కొనసాగుతోంది. హెచ్‌టీ పత్తి విత్తనాలు విత్తి సాగు చేస్తే కలుపు నివారణ కోసం గ్లైఫోసైడ్ మందులు కొట్టాల్సిందే. గ్లైఫోసైడ్ వాడితే పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది...