పురపాలక ఎన్నికల పోలింగ్‌ను స్మార్ట్ టెక్నాలజీతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఫించనుదారుల కోసం వినియోగిస్తున్న ఫేసియల్ రికగ్నైజేషన్ పరిజ్ఞానంతో ఓటర్ల గుర్తింపును ఎస్ఈసీ ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలక సంస్థలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కొంపల్లి పరిధిలో 7, దూలపల్లి పరిధిలోని 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు.
ఓటర్ని ఎలా గుర్తిస్తుందంటే...
టీఎస్టీఎస్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన టీ- పోల్ మొబైల్ యాప్‌లో ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న ఫోటో, ఓటర్ల వివరాలు ఇప్పటికే నిక్షిప్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటరు రాగానే ముఖాన్ని, జాబితాలోని ఫోటోను యాప్ పరిశీలిస్తుంది. ఫోటో సరిపోతే సదరు ఓటరు వివరాలను చూపిస్తుంది. డూప్లికేట్ ఓటరైనా... సంబంధిత వార్డు కాకున్నా... రెండు ఓట్లు ఉన్నా... వెంటనే వివరాలు మొబైల్ అప్లికేషన్లో చూపిస్తుంది. అప్లికేషన్లో సమయం కూడా ఉంటుంది కనుక... సమయం దాటిన తరువాత ఓట్లు వేయడం లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఈ యాప్‌తో దొంగ ఓటర్లను గుర్తించడం... రిగ్గింగ్ లాంటివి జరగకుండా... పారదర్శక పోలింగ్‌తో పాటు సమయం ఆదా అవుతుందంటున్నారు అధికారులు.