తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లాభాలు ఆర్జిస్తున్నాడు! - విజయనగరంలో యువ రైతు శంకర్​పై ప్రత్యేక కథనం

భారమైన పెట్టుబడులు, దళారుల దందాలు, మార్కెట్ మోసాలు, కరవులు, ప్రకృతి విపత్తులు. ఇవన్నీ వ్యవసాయానికి ప్రతి బంధకాలు. ఇన్ని ఇబ్బందులతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల్లో చాలామంది వ్యవసాయం వదిలేస్తున్నారు. ఇప్పటి తరాలైతే వ్యవసాయం వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అలాంటి పరిస్థితుల్లో లక్షల రూపాయల ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని సాగు వైపు అడుగులు వేశాడు ఓ యువకుడు. మేలైన విధానాలతో మెరుగైన దిగుబడులు సాధించడమే కాదు తోటి రైతులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. రైతుమిత్ర పేరిట సంస్థ స్థాపించి అన్నదాతల పంట తానే కొనుగోలు చేస్తూ దళారుల ఊసే లేకుండా చేస్తున్నాడు. 'సాగు బాగు' అని నిరూపిస్తున్న ఆ యువకుడిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

young farmer sankar stor
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-September-2020/8992590_828_8992590_1601459484134.png

By

Published : Sep 30, 2020, 10:11 PM IST

ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లికి చెందిన లింగాల శంకర్.. ఇంటర్ తర్వాత విశాఖలోని గీతం కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. మొదటి ప్రయత్నంలోనే హైదరాబాద్​లో ఐటీ ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 11.50 లక్షల రూపాయల జీతంతో ఆరేళ్ల పాటు ఉద్యోగం చేశాడు. అయితే లక్షలు ఇచ్చే ఉద్యోగం అతనికి తృప్తి ఇవ్వలేదు. తన మనసుకు నచ్చిన పని చేయాలని కొలువుకు రాజీనామా చేసి సేద్యం వైపు మళ్లాడు. సాగు వద్దని.. అందులో దిగితే నష్టం తప్ప లాభాలు ఉండవని తల్లిదండ్రులు వారించినా వినలేదు. పట్టుబట్టి వారిని ఒప్పించాడు. అలా వ్యవసాయం వైపు అడుగులు వేశాడు.

ప్రకృతి సాగు-బహుళ పంటలు బాగు

మొదట్లో తల్లిదండ్రులు సహకారంతో పంటల సాగు చేపట్టాడు. అయితే ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ఆధునిక వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. గో ఆధారిత, సేంద్రియ, ప్రకృతి సాగు విధానాలను అనుసరించాడు. బహుళ పంటలసాగు పాటించాడు. 2 ఎకరాల్లోనే బీర, సొరకాయ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కంద, ముల్లంగి, బీట్​రూట్ వేశాడు. వాటిలో అంతర పంటలుగా వంగ, టమాటా, మిరప, బెండ, ఉల్లి వాటి మధ్య ఆకుకూరలు, చామంతి పూల సాగు చేశాడు. మరోపక్క స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఇలా 365 రోజులూ ఏదో ఒక పంట చేతికి వచ్చేలా సాగు విధానాన్ని అనుసరించాడు.

సొంతంగా మార్కెటింగ్

పంటల సాగులో స్వల్ప పెట్టుబడులు, నూతన విధానాలతో మెరుగైన దిగుబడులు సాధిస్తున్న శంకర్ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రైతుమిత్ర సంఘం పేరుతో తన పంటలతోపాటు తోటి రైతుల పంటలను మార్కెటింగ్ చేస్తున్నాడు. వారి ఉత్పత్తుల అమ్మకానికి హైదరాబాద్, విశాఖ జిల్లా అడవివరంలో దుకాణం ఏర్పాటు చేశాడు. అక్కడ సేంద్రీయ కూరగాయలు విక్రయిస్తూ అటు వినియోగదారులకూ మేలు చేస్తున్నాడు.

రైతుమిత్ర.. వారికి వరం

గ్రామీణ ప్రాంతాల రైతులు కాకుండా.. విశాఖలో మిద్దె తోటలు సాగు చేస్తున్న ఔత్సాహికులకు శంకర్ తోడ్పాటునందిస్తున్నాడు. వారు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అదనపు పంటను మార్కెట్ చేస్తున్నాడు. రైతుమిత్ర సంఘం రైతులకు సాగులో అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. పంటలు సాగు చేయించటం, ఉత్పత్తులకు మార్కెట్ కల్పించటం, సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడం లాంటివి సంఘ సభ్యులు చేస్తారు. రైతుమిత్ర పేరుతో శంకర్ అందిస్తున్న సేవల పట్ల తోటి రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సంఘంలో చేరిన తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలుగుతున్నామని అంటున్నారు.

ఎంతో అనుభవమున్న రైతులే సేద్యంలో ఉన్న కష్టనష్టాలను తట్టుకోలేక సాగు వదిలేస్తున్న ఈ క్రమంలో.. లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం వైపు అడుగులేసి అందులో లాభాలు గడిస్తూ.. తోటి రైతులకూ సహాయ సహకారాలు అందిస్తున్న యువరైతు శంకర్ బాట నేటి తరానికి ఆదర్శం.

ఇదీ చదవండి:శాంతించిన కృష్ణమ్మ... కుళ్లిపోయిన పంటలు

ABOUT THE AUTHOR

...view details