హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్‌లో పత్తి విత్తనోత్పత్తి, సంబంధిత అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి, వరి సహా ఇతర పంటల విత్తనోత్పత్తి, నాణ్యతా ప్రమాణాలు, నిషేధిత హెచ్‌టీ పత్తి విత్తనాల నిరోధం, గ్లైఫోసెట్ కలుపు మందుల నివారణ వంటి అంశాలపై చర్చించారు. వాతావరణం అనుకూలించక సరైన దిగుబడి రాక, పంట నష్టపోతే మొహం చాటేస్తున్న కంపెనీలపై అజమాయిషీ ఉండాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నాసిరకం పత్తి నిరోధానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నాసిరకం పత్తి నిరోధానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
రాష్ట్రంలో పత్తి విత్తనోత్పత్తి రైతులతో కంపెనీలు ముందుగానే ఒప్పందం చేసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పలు సందర్భాల్లో పంట దెబ్బతిని నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఇక నుంచి విత్తనం ఇచ్చే ముందే అధికారికంగా ఒప్పందం చేసుకోవాలన్నారు. లేని పక్షంలో సంబంధిత కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాంపల్లిలో పత్తి విత్తనోత్పత్తి, సంబంధిత అంశాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
సీఎం ఆదేశాలతో వ్యవసాయ అనుబంధ రంగాలపై మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. తాజా రబీలో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి రాబోతుందన్నారు. వరి పంట 38.19 లక్షల ఎకరాల్లో సాగవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పత్తి సాగవుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, టీఎస్ సీడ్స్ సంస్థ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఈటీవీ భారత్ ఎఫెక్ట్: క్లీన్‌గా మారిన నాగర్‌కర్నూల్ కలెక్టరేట్