తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ భయం... రైళ్లలో సగానికి పైగా బెర్తులు ఖాళీ - విశాఖ గరీభ్‌రథ్‌ బెర్తులు ఖాళీ

కొవిడ్ రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ విజృంభణతో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. కానీ ప్రస్తుతం నడుస్తున్నవాటిలో కూడా సగం బెర్తులు కూడా నిండని పరిస్థితి నెలకొంది. వేసవిలో సాధారణంగా అధికంగా రద్దీ ఉంటుంది. ప్రధానంగా కాచిగూడ నుంచి బయలుదేరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ గరీభ్‌రథ్‌ రైళ్లలో బెర్తులు ఖాళీగా దర్శనమివ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Empty berths in trains in south central railway
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ గరీభ్‌రథ్‌ రైళ్లలో బెర్తులు ఖాళీ

By

Published : May 3, 2021, 2:21 PM IST

ప్రయాణికులు రైళ్లలో బెర్తులు వెలవెలబోతున్నాయి. కరోనా భయంతో సగం కూడా భర్తీ అవడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాచిగూడ నుంచి బయలుదేరే ప్రధాన రైళ్లలో పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌:

* కాచిగూడ నుంచి తిరుపతి మీదుగా చిత్తూరు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం దాదాపు 1,200 బెర్తులు, సీట్లు ఉంటాయి. 3వ తేదీ ప్రయాణానికి చూస్తే ఏకంగా 1,030 (ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు) బెర్తులు ఖాళీగా ఉన్నాయి. స్లీపర్‌లో 583, సెకండ్‌ సిట్టింగ్‌ 261, థర్డ్‌ ఏసీ 138, సెకండ్‌ ఏసీ 44, ఫస్ట్‌ ఏసీలో 4 బెర్తులు నిండలేదు.

విశాఖ గరీబ్‌రథ్‌:

* సికింద్రాబాద్‌-విశాఖపట్నం గరీబ్‌రథ్‌లో రిజర్వేషన్‌కు చాలా డిమాండ్‌ ఉంటుంది. 3వ తేదీ ప్రయాణానికి చూస్తే 641 థర్డ్‌ ఏసీ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 4న 712, 5న 692, 6న 732 బెర్తులు నిండలేదు. ఇక్కడ నుంచే విశాఖపట్నం వెళ్లే మరో ప్రత్యేక రైల్లో సెకండ్‌ సిటింగ్‌లో 839 సీట్లు, ఛైర్‌కార్‌లో 1,080 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

పరిస్థితి పూర్తిగా భిన్నం:

వేసవికాలం వచ్చిందంటే రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో నెలరోజుల ముందు ప్రయత్నం వేసినా ఓ పట్టాన రిజర్వేషన్‌ దొరకదు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో పరిస్థితి పూర్తిగా మారింది. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు కూడా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. జనవరి నుంచి రైళ్లన్నీ పూర్తి స్థాయిలో నిండుతున్నా ఏప్రిల్‌ నాటికి సీట్ల భర్తీకి పరిగణనలోకి తీసుకునే ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) శాతం భారీగా పడిపోయింది. జనవరిలో 115 శాతం, ఫిబ్రవరిలో 122, మార్చిలో 114 శాతం ఉండగా.. ఏప్రిల్‌ మొదటి పక్షంలో 79కి పడిపోయింది. రెండో పక్షంలో దాదాపు 65 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడవ్వాల్సి ఉంది. భారీగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారు ప్రయాణాలను మానుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లలో మాత్రం బెర్తులు నిండుతున్నాయి.

ఏసీ కంటే స్లీపర్‌ ముద్దు

వేసవిలో దూర ప్రయాణికుల తొలి ప్రాధాన్యం ఏసీ బోగీ. కొవిడ్‌తో చాలామంది స్లీపర్‌లో ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏసీ బోగీల్లో గాలి ఎక్కువసేపు లోపల ఉండకుండా బయటినుంచి స్వచ్ఛమైన గాలి తరచూ వచ్చేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయాణికులు అంతగా ఆసక్తి చూపడం లేదు.

ఇదీ చూడండి:మీ దగ్గర పనిచేశా.. మీ గురించి తెలియదా?: ఈటల

ABOUT THE AUTHOR

...view details