ఏ దసరా పండక్కో లేక సంక్రాంతి వేడుక్కో వచ్చే సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది పౌరులు వారి సొంతూళ్లకు ప్రయాణమయ్యేవారు. సెలవులు పూర్తయ్యేసరికి మళ్లీ వారంతా బిలబిలమంటూ నగరానికి వచ్చేసేవారు. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో దాని బారి నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుంచి అనేక మంది సొంతూరి బాట పడుతున్నారు. వేతన జీవులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇక్కడే ఉండిపోతూ తమ భార్య, పిల్లలను తమ సొంతూరికో లేక అత్తారింటికో పంపేస్తున్నారు. తమ విధి నిర్వహణలో అనుకోకుండా కరోనా సోకితే అందరూ ఇబ్బంది పడకుండా ఇలా ముందు జాగ్రత్తపడుతున్నారు.
కరోనాకు దూరంగా... పల్లెల్లో భద్రంగా!
కరోనా విజృంభణ నేపథ్యంలో దాని బారి నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుంచి అనేక మంది సొంతూరి బాట పడుతున్నారు. వేతన జీవులు, కార్మికులు తమ భార్య, పిల్లలను సొంతూళ్లకు పంపేస్తున్నారు. తమ విధి నిర్వహణలో అనుకోకుండా కరోనా సోకితే అందరూ ఇబ్బంది పడకుండా ఇలా ముందు జాగ్రత్తపడుతున్నారు. కరోనా తీవ్రత తగ్గి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక వారిని తిరిగి తీసుకురావాలని అంతవరకూ వారిని అక్కడే ఉంచాలన్న ఆలోచనలో ఉన్నారు.
ప్రస్తుతం పనిప్రదేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో..ఇంటి నుంచి పనిచేసే విధానం లేని వేతన జీవులు, ఉద్యోగులు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ సొంత గ్రామాల్లో ఉంటే తమ భార్య, పిల్లలు సురక్షితంగా ఉంటారని భావిస్తూ వారిని అక్కడకు పంపేస్తున్నారు. ఇంటిపని, వంటపని తామే చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ డేటా లభిస్తోంది. దీంతో పిల్లలు తమ పుస్తకాలు, ట్యాబ్‌లు, ఫోన్లను తీసుకుని ఊర్లకు ఉత్సాహంగానే వెళ్తున్నారు. సొంతూళ్లకు కుటుంబాలను పంపిస్తున్న వారిలో పోలీసులు, డాక్టర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు.
ఆంక్షలు తగ్గడంతో..
ప్రజా రవాణా కొంతమేర అందుబాటులోకి రావడం, కరోనా కట్టడి ఆంక్షలు తగ్గడంతో ప్రైవేటు వాహనాలు లేదా సొంత వాహనాల్లో కుటుంబ సభ్యులను ఊర్లకు తీసుకెళ్తున్నారు. కరోనా తీవ్రత తగ్గి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక వారిని తిరిగి తీసుకురావాలని అంతవరకూ వారిని అక్కడే ఉంచాలన్న ఆలోచనలో ఉన్నారు.
- ‘‘కరీంనగర్‌లోని మా గ్రామంలోనూ మొబైల్ డేటా వేగంగా ఉంటోంది. పిల్లలు ఊర్లోనే ఉంటూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. చదువులకు ఆటంకం లేదు’’ అని సంతోష్ అనే వ్యక్తి తెలిపారు.
- ‘‘కరోనా కారణంగా నా విధి నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది. ప్రతిరోజూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇంట్లో చిన్న పిల్లలు ఉండటంతో తప్పనిసరి ఊరికి పంపించాల్సి వచ్చింది’’ అని ఓ ప్రభుత్వ ఉద్యోగి తెలిపారు.
- "ఉద్యోగానికి ప్రతిరోజూ తప్పనిసరిగా వెళ్లాలి.. రోజూ వెళ్లివచ్చేటప్పుడు, కార్యాలయంలో ఎక్కడైనా కరోనా సోకే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భార్యా, పిల్లలను నల్గొండలోని మా అమ్మానాన్నల వద్దకు పంపించేశాను" అని ఎల్‌బీ నగర్‌కు చెందిన రవీందర్ అనే వ్యక్తి చెప్పారు.