తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండు - తెలంగాణలో పెరిగిన విద్యుత్​ డిమాండ్​

తెలంగాణలో విద్యుత్తు డిమాండు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉంది. జులై 28న ఉదయం 10.44 గంటల ప్రాంతంలో అత్యధికంగా 11,114 మెగావాట్ల డిమాండు నమోదైంది. గతేడాది ఇదే రోజు (జులై 28న) గరిష్ఠ డిమాండు 7,520 మెగావాట్లే. కాగా, రాష్ట్ర చరిత్రలో రోజువారీ అత్యధిక డిమాండు ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్లుగా నమోదైంది.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండు

By

Published : Jul 29, 2020, 7:14 AM IST

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మంగళవారం ఉదయం 10.44 గంటల ప్రాంతంలో అత్యధికంగా 11,114 మెగావాట్ల డిమాండు నమోదైంది. లాక్‌డౌన్‌ విధించాక గత 4 నెలల్లో తొలిసారిగా ఈ స్థాయిలో డిమాండు పెరిగిందని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) వెల్లడించాయి. గతేడాది ఇదే రోజు (జులై 28న) గరిష్ఠ డిమాండు 7,520 మెగావాట్లే. కాగా, రాష్ట్ర చరిత్రలో రోజువారీ అత్యధిక డిమాండు ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్లుగా నమోదైంది.

లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమల, వాణిజ్య వినియోగం తగ్గడం వల్ల ఏప్రిల్‌లో ఒకదశలో రోజువారీ డిమాండు 4,500 మెగావాట్లకు పడిపోయింది. నెల రోజులుగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి 80 లక్షల ఎకరాలకు చేరింది. మొత్తం 24.10 లక్షల వ్యవసాయ బోర్లు నిరంతరాయంగా నడుపుతున్నందున విద్యుత్తు డిమాండు బాగా పెరుగుతోంది.

ప్రస్తుత సీజన్‌లో మొత్తం కోటీ 25 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా. అదే జరిగితే వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు డిమాండు మరింత పెరిగి 14 వేల మెగావాట్లకు చేరుతుందని డిస్కంల అంచనా. ప్రతిరోజూ పగలు, రాత్రి మధ్య డిమాండులో భారీగా అంతరం ఏర్పడుతున్నందున సరఫరా నిలిచిపోకుండా డిస్కంలు థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించి గ్రిడ్‌ను నియంత్రిస్తున్నాయి.

వచ్చేనెలలో భద్రాద్రి రెండో ప్లాంటు ప్రారంభం

భద్రాద్రి జిల్లా మణుగూరు సమీపంలో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్తు కేంద్రంలో ఒక్కోటి 270 మెగావాట్ల సామర్థ్యమున్న 4 ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక ప్లాంటులో ఉత్పత్తి జరుగుతోంది. రెండోదాన్ని వచ్చేనెలలో, మూడో ప్లాంటును సెప్టెంబరులో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు తెలిపారు. ఇవి ప్రారంభమైతే రాష్ట్ర విద్యుత్తు డిమాండు తీర్చేందుకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండు ఎంత పెరిగినా ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details