ఈవీఎంల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన రాష్ట్రంలో తొలిదశలోనే పోలింగ్ పూర్తైంది. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో కోటీ 86 లక్షలా 17వేలా 91 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 62.69 శాతం ఓటింగ్ నమోదైంది.
తేలనున్న 443 మంది అభ్యర్థులు భవితవ్యం
17 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 418 మంది పురుషులు కాగా... 25 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా తరఫున అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు పోటీ చేయగా... బీఎస్పీ నుంచి ఐదుగురు, సీపీఐ, సీపీఎం నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు, మజ్లిస్ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. నిజామాబాద్లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఎన్నికలో బరిలో నిలిచారు. ఇందులో 178 మంది రైతులే కావడం విశేషం. అత్యల్పంగా మెదక్లో పది మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు.
18 జిల్లాలో 35 కేంద్రాలు
ఓట్ల లెక్కింపులో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ఒకే ప్రాంగణంలో జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఓట్లను ఒక్కో కేంద్రంలో లెక్కిస్తారు. మొత్తం 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు.