తెలంగాణ

telangana

ETV Bharat / state

Colleges: కళాశాలలన్నీ ‘దోస్త్‌’ పరిధిలోకి సాధ్యమేనా..!

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్​ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను దోస్త్ ​(DOST) పరిధిలోకి తెచ్చే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. యాజమాన్య కోటాలో 30 శాతం ప్రవేశాలకు అనుమతిచ్చి అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా సమాలోచనలు చేస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో తాజాగా చర్చ జరగడం బలం చేకూరుస్తోంది.

dost
‘దోస్త్‌’

By

Published : Jun 24, 2021, 6:57 AM IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారానే చేపట్టాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం దాదాపు 1050 ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను దోస్త్‌ ద్వారా చేపడుతుండగా.. మరో 45 ప్రముఖ కళాశాలలు మాత్రం సొంతగా నిర్వహించుకుంటున్నాయి. వాటినీ ఈసారి దోస్త్‌ పరిధిలోకి తెస్తే డిగ్రీ సీట్ల భర్తీకి ఒకే విధానం అమలు చేసినట్లవుతుందని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. దానివల్ల గ్రామీణ విద్యార్థులు సైతం నాణ్యమైన కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. దీనిపై తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి సమక్షంలో లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది.

మేనేజ్‌మెంట్‌ కోటా ఇచ్చి..

విశ్వవిద్యాలయాలు నిర్దేశించిన డిగ్రీ ఫీజులు రూ.14వేల నుంచి రూ.18వేల మధ్యలోనే ఉన్నందున ఆ రుసుములు తీసుకొని కళాశాలలను నడపలేమని, తాము దోస్త్‌ పరిధిలోకి వచ్చేది లేదని దాదాపు 45 కళాశాలలు న్యాయస్థానం ఆదేశాలతో సొంతగా ప్రవేశాలు జరుపుకొంటున్నాయి. వార్షిక రుసుమును రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. అందుకే వాటిని కూడా దోస్త్‌ పరిధిలోకి తేవాలంటే ఎప్పటి నుంచో యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్న యాజమాన్య కోటాను 20-30 శాతం ఇవ్వొచ్చన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దానివల్ల 70 శాతం సీట్లను ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్‌ ప్రాతిపదికన కేటాయించవచ్చని చర్చించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, ఉపాధ్యాయ విద్య, మెడికల్‌...ఇలా అన్ని సీట్లకు యాజమాన్య కోటా ఉండగా.. జనరల్‌ డిగ్రీలోనూ ఎందుకు ఉండరాదని ఒకరిద్దరు అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే మిగిలిన కళాశాలలు ‘దోస్త్‌’ పరిధికి చేరినా మైనారిటీ హోదా ఉన్న కళాశాలలు వస్తాయా? న్యాయపరమైన చిక్కులు ఎదురు కావా? అన్న ప్రశ్నలు కొందరు లేవనెత్తారు. త్వరలో విద్యాశాఖ మంత్రి సమక్షంలో జరిగే ఉపకులపతుల సమావేశంలో దీనిపై చర్చించాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో ప్రవేశపరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details