ED Raids on Brightcom Group in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కలకలం రేపాయి. ఈ నెల 23న బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్‌లో నిర్వహించిన సోదాల్లో రూ.3.3 కోట్ల నగదుతో పాటు.. రూ.9.3 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ సంస్థకు చెందిన సీఈఓ, సీఎఫ్ఓ, ఆడిటర్ ఇల్లు, కార్యాలయాల్లో ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. ఆడిటర్ మురళీ మోహన్ ఇంట్లో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.
ఈ క్రమంలోనే సీఈఓ సురేశ్‌కుమార్ రెడ్డి, సీఎఫ్ఓ రాజు ఇళ్లల్లో కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లుఈడీ అధికారులు తెలిపారు. బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ ( Brightcom Group) షేర్లు విక్రయించి దాదాపు రూ.868 కోట్ల రూపాయలను సమీకరించినట్లు గుర్తించామని చెప్పారు. కంపెనీ ఖాతాలో జమ అయిన నగదును ఇతర డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే బీజీఎల్‌పై సెబీకి ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు నిర్వహించి.. లావాదేవీలపై ఆంక్షలు విధించారు. బ్యాంకు ఖాతా వివరాలను ఫోర్జరీ చేసినట్లు సెబీ గుర్తించింది. సెబీ దర్యాప్తు ఆధారంగా.. ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద బ్రైట్‌కామ్ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బ్రైట్‌కామ్ గ్రూప్ సీఎండీ సురేశ్‌కుమార్ రెడ్డి, సీఎఫ్‌ఓ నారాయణ్ రాజులను.. కంపెనీలో లేదా దాని అనుబంధ కంపెనీల్లో ఏ యాజమాన్య హోదాను చేపట్టడంపై తదుపరి ఉత్తర్వుల వరకు సెబీ నిషేధం విధించింది. సెక్యూరిటీల మార్కెట్ నుంచి కూడా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సురేశ్‌కుమార్ రెడ్డిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే బ్రైట్‌కామ్ గ్రూప్ కంపెనీ చట్టబద్ధ ఆడిటర్లయిన పి.మురళి అండ్ కంపెనీ, పీసీఎన్ అండ్ అసోసియేట్స్‌లతో పాటు వాటి పూర్వ, ప్రస్తుత భాగస్వాములు ఎవరూ బీజీఎల్, దాని అనుబంధ సంస్థలకు ఏ హోదాలోనూ కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదని సెబీ ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇది కూడా అమల్లో ఉంటుందని సెబీ తెలిపింది. ఈ మేరకు సెబీ సత్వర జోక్యం అవసరం కావడంతో మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే సంస్థపై సెబీ ఇలా రెండోసారి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఇదే తొలిసారి. 2023 ఏప్రిల్ 13న బీజీఎల్‌తో పాటు కంపెనీ సీఎండీ సురేశ్‌కుమార్ రెడ్డికి సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. సెబీ నిర్వహించిన విచారణలో అకౌంటింగ్ వ్యవహారాల్లో అవకతవకలు గుర్తించింది. తాజాగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ప్రిఫరెన్షియల్ కేటాయింపులో బీజీఎల్, ఇతర వ్యక్తులు 24 మంది అవకతవకలకు పాల్పడి షేరు దరఖాస్తు డబ్బుల్ని కల్పిత రసీదులతో స్వాహా చేసినట్లు వివరించింది.
ED Raids at Prathima Medical College : రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. మెడికల్ కాలేజీల్లో అక్రమాలు?
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ అనుబంధ ఛార్జీషీట్లపై ఈనెల 10న విచారణ