Nandakumar ED Enquiry : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఈడీ విచారిస్తోంది. హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందకుమార్‌ను రెండ్రోజుల పాటు అధికారులు ప్రశ్నించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది.
ఇందులో భాగంగా విచారించేందుకు అనుమతివ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరు విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు అనుమతి మేరకు చంచల్‌గూడ జైలుకు వెళ్లిన ఈడీ అధికారులు.. నందకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణ కోసం కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇవాళ, రేపు నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.