TSPSC Paper Leakage Case ED Petition In Nampally Court: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఇందుకు సంబంధించి మార్చి 23న సీసీఎస్ ఏసీపీకు లేఖ రాసినట్లు ఈడీ పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక వివరాల కేంద్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఇందులో భాగంగా పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంటల్లు రికార్డు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. చంచల్‌గూడ కారాగారంలో ఉన్న నిందితులను ప్రవీణ్, రాజశేఖర్‌లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని ఈడీ కోర్టుకు చెప్పింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అభియోగం మోపిందని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీనిలో భాగంగా సెక్షన్ 48, 49 కింద ఈడీకి విచారించే అర్హత ఉందని ఆయన పేర్కొన్నారు. విచారణలో భాగంగా జైలులో విచారణ సందర్భంగా ల్యాప్‌టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతూ.. ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఇద్దరి నిందితులను విచారిస్తున్నప్పుడు చంచల్‌గూడ జైలులో తగిన ఏర్పాట్లు చేసేవిధంగా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఈడీ కోరింది.
ఈడీ రంగ ప్రవేశం: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు అనుమానిస్తూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను సేకరించి.. ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌ను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఈ మంగళవారం సిట్ అధికారులు తమ దర్యాప్తు చేసిన.. విచారణ నివేదిక మొత్తాన్ని హైకోర్టులో సమర్పించారు.
ప్రధాన సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అయితే ఆమెను మరోసారి విచారించే ఆలోచనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో శంకరలక్ష్మి, నారాయణకు బుధ, గురువారాల్లో విచారణకు రావాలని ఆదేశించింది. వీరి వద్దనుంచి విలువైన సమాచారం రాబట్టి.. ఆ తర్వాత ప్రధాన నిందితులను విచారించి.. ఎంత మొత్తంలో నగదు చేతులు మారిందో తేల్చే పనిలో ఈడీ ఉంది.
రూ.40లక్షలు చేతులు మారాయి: సిట్ అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు... ఏఈఈ, డీఏఓ, ఏఈ ప్రశ్నాపత్రం లీకైనట్లు తేల్చారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో 40లక్షలు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈడీ అధికారులు నిందితుల నుంచి వాంగ్మూలం సేకరించి సంబంధిత వివరాల ఆధారంగా మరికొంత మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: