దిల్లీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అరెస్టు - CBI arrests Abhishek Boinapalli
08:23 November 10
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఇద్దరు అరెస్టు
దేశంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. కేసులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న అభిషేక్ బోయిన్‌పల్లిని కటాకటాల వెనక్కినెట్టిన ఈడీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. శరత్ చంద్రారెడ్డి, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్టు చేసినట్లు తెలిపింది. వారికి మద్యం వ్యాపారంతో సంబంధం ఉందని పేర్కొంది.
శరత్, వినయ్‌బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉండటం సహా ఆ గ్రూపునకు చెందిన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారన్న అభియోగాలపై ఆయణ్ను అరెస్టు చేసింది.