తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 4:46 AM IST

Updated : Oct 6, 2020, 5:45 AM IST

ETV Bharat / state

నేడు ఎంసెట్​ ఫలితాలు.. 9 నుంచి కౌన్సెలింగ్​..

ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. నవంబరు 5 వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూలు ఖరారు చేశారు. మిగిలిన సీట్లను కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం నవంబరు 4న మార్గదర్శకాలు ప్రకటించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.

eamcet result release today in telangana
నేడు ఎంసెట్​ ఫలితాలు.. 9 నుంచి కౌన్సెలింగ్​..

నేడు ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు జేఎన్టీయూహెచ్​లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ నెల 9 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేసింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 9 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. సహాయ కేంద్రం ఎంచుకోవాలి. ఈనెల 12 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఈ నెల 22న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. 22 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసుము చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

29న చివరి విడత

ఈనెల 29న తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 29న చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 30న ధ్రువపత్రాల పరిశీలన, 30, 31 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. నవంబరు 2న చివరి విడత సీట్లు కేటాయిస్తారు. నవంబరు 2 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు.. కాలేజీలకు వెళ్లి చేరాలని నవీన్ మిత్తల్ సూచించారు. మిగిలిన సీట్ల కోసం కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. అందుకోసం నవంబరు 4న మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. కౌన్సెలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 7న వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

ఇదీ చదవండి:దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​

Last Updated : Oct 6, 2020, 5:45 AM IST

ABOUT THE AUTHOR

...view details