తెలంగాణ

telangana

ETV Bharat / state

Dussehra 2021: దసరా సందడి షురూ.. రద్దీగా మారిన పూలమార్కెట్లు - telangana varthalu

దసరా పర్వదినం వేళ మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని మార్కెట్లకు జనం పోటెత్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత దసరా, బతుకమ్మ పండుగలు ప్రజల్లో సంతోషం నింపాయి. హైదరాబాద్ జంటనగరాల్లో పూల మార్కెట్లు రద్దీగా మారాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు, ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే పూలు, పూజా సామగ్రి ధరలు పెరిగిపోయాయి. అసలే కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్న తరుణంలో బంతి, చేమంతి, గులాబీ, మల్లె... ఇలా ఏ పూలు తీసుకున్నా ధరలు ఎక్కువగా ఉండటం రైతులకు కలిసొచ్చింది. గత దసరా తరహాలో ఈసారి ధరలు మండిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

Dussehra 2021: అంబరాన్నంటుతున్న దసరా సంబురాలు.. రద్దీగా మారిన మార్కెట్లు
Dussehra 2021: అంబరాన్నంటుతున్న దసరా సంబురాలు.. రద్దీగా మారిన మార్కెట్లు

By

Published : Oct 14, 2021, 5:22 PM IST

Updated : Oct 14, 2021, 7:31 PM IST

దసరా సందడి షురూ.. రద్దీగా మారిన పూలమార్కెట్లు

తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఓ వైపు దసరా శరన్నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు... తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బతుకమ్మ, దసరా నవరాత్రులు నేపథ్యంలో పూల మార్కెట్లు రద్దీగా మారాయి. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాలు, పట్టణాలు, నగరాల్లో మార్కెట్లు, రైతుబజార్లన్నీ కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక బతుకమ్మ అంటేనే పూల పండగ. పూలు లేకుండా పూజ జరగదు. దీంతో పూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కనకాంబరం పూల ధరలు చుక్కలను అంటుతున్నాయి. మార్కెట్​లో కిలో కనకాంబరం పూల ధర రూ.1000 నుంచి 1400 వరకు అమ్ముడుపోతున్నాయి. మల్లెపూలు కిలో ధర రూ.750, సన్నజాజి పూలు ధర రూ.800 చొప్పున పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కిలో బంతిపూల ధర రూ.60 నుంచి 120 రూపాయల దాకా పలుకుతుంది. ఈసారి దసరా పండుగ వేళ... అన్ని రకాల పూల ధరలే కాకుండా కొబ్బరికాయ, గుమ్మడి కాయ వంటి పూజాసామగ్రి ధరలు సైతం అధికంగా ఉన్నాయని వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రద్దీగా మారిన పూల మార్కెట్లు

రేట్లు బాగున్నాయ్​ ఈసారి. కేజీ చామంతి 200రూపాయలు, 200రూపాయలు గులాబీ పూలు, రూ.80 నుంచి 100 వరకు బంతిపూలు ఇలా ఉన్నాయి. గతేడాది కరోనా ఉండడం వల్ల ఈ సారి జనాలు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జనాల్లో భయం తొలగిపోయింది. మాస్కులు కూడా పెట్టుకుంటలేరు. -శంకర్​, వినియోగదారుడు

ముంచిన వర్షాలు

గులాబ్ తుపాన్ ప్రభావంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలు, వరదలు పూల రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. పండుగలను దృష్టిలో పెట్టుకుని సాగు చేసినా పూల దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావంతో వరద నీరు క్షేత్రాల్లోకి చేరి పంట చాలా వరకు దెబ్బతింది. పొరుగున కర్ణాటక, మహారాష్ట్రలో కూడా భారీగా కురిసిన వర్షాలు, వరదల తీవ్రతకు పంట చాలా తక్కువగా చేతికొచ్చింది. అదే సమయంలో పండుగలు కలిసి రావడంతో పంట ఉత్పత్తులు తక్కువైనా కూడా ధరలు బాగా ఉండటంతో రైతులకు చాలా వరకు ఉపశమనం కలిగినట్లైందని చెప్పవచ్చు. గులాబీ పూలు కిలో ధర రూ.200, ఆస్టర్ రూ.150, చామంతి రూ.150 నుంచి రూ.200 చొప్పున ధరలు మండిపోతున్నాయి. 5 అరటి ఆకులు ధర రూ.100, మంచి గుమ్మడి కాయ రూ.150 నుంచి 200, బూడిద గుమ్మడికాయ రూ.125, 1 లోటస్ ధర రూ.25, కొబ్బరికాయ రూ.25 నుంచి 30 చొప్పున ధరలు పలుకుతున్నాయి. అవన్నీ టోకు మార్కెట్‌, రైతుబజార్లలో ధరలే. ఇక చిల్లర మార్కెట్‌లో చూసుకుంటే వినియోగదారుడు జేబు ఖాళీ అవ్వాల్సిందే. ఇలాంటి పండులప్పుడే కదా తమకు నాలుగు రూపాయలు వచ్చేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పూలకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్

దసరా పండుగ సంవత్సరానికి ఓసారి వస్తది. ఆ పండుగ కోసం రైతులు ఎదురుచూస్తూ ఉంటారు. రైతులకు కష్టాలు తప్పవు. ఈ రెండు రోజులే జనాలు కొనేందుకు వస్తరు. కొవిడ్​ భయాలు జనాల్లో లేనే లేదు. జనాలు ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలి. ఈ మధ్య వర్షం పడకపోతే బాగుండేది. -రవి, పూల రైతు

పూల వ్యాపారుల్లో జోష్​

ఈ ఏడాది వినాయక చవితి నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రుల వరకు కూడా పూల వ్యాపారుల్లో జోష్ నింపినట్లైంది. ఒక్కోసారి సరైన ధరలు లభించక రైతులు నష్టపోయినా కూడా వ్యాపారుల దందా అద్భుతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో సరిగా పంట చేతికి రాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పూలు తెప్పించి మార్కెట్లో కొరత ఉత్పన్నం కాకుండా కమీషన్ ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదటపడుతున్న పరిస్థితుల్లో మంచి మార్పులను ఆహ్వానిస్తూ... భయం లేకుండా జనం బయటకు వచ్చి మార్కెట్‌లో కార్యకలాపాలు మెరుగుపడేందుకు దోహదం చేస్తున్నారు. మార్కెట్‌లో అధిక శాతం జనం మాస్క్‌లు ధరించకుండా భౌతిక దూరంగా పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఒకింత భయాందోళన నెలకొంటోంది. బతుకమ్మ, దసరా వేళ పూల మార్కెట్ ఆశాజనకంగా ఉందని, తమకు, రైతులకు ఓ మోస్తరు లాభాలు వచ్చాయని వర్తకులు చెబుతున్నారు.

పూల వ్యాపారుల్లో జోష్

రైతన్నకు ఊరట

అదృష్టవశాత్తూ... వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల పుణ్యమా అని పూల రైతులకు మంచి ఊరట కలిగినట్లైంది. ప్రతికూల పరిస్థితులు నష్టపరిచినా కూడా మార్కెట్‌లో ధరలు కలిసిరావడం రైతులకు చేయూత అందించినట్టుగా ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించిన తరుణంలో రాబోయే దసరా పండుగపై కూడా రైతులు, వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకోవడం విశేషం.

ఇదీ చదవండి: Bathukamma 2021: విదేశాల్లో 'సద్దుల' సంబురం.. ఉట్టిపడిన తెలుగందం

Last Updated : Oct 14, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details