తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

అభివృద్ధిలో పల్లెలకు ఆదర్శంగా నిలవాల్సిన పట్టణాలు దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. ఇరువైపులా చెట్లతో స్వాగతం పలకాల్సిన రోడ్లు... చెత్తకుప్పలతో పలకరిస్తున్నాయి. డంపింగ్​యార్డులు లేక...వ్యర్థాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. దోమలు, పందులు వీధుల్లో స్వైర విహారంతో రోగాలు పలకరిస్తున్నాయి. ఏ మున్సిపాలిటీలో చూసినా..ఏ కార్పోరేషన్​పై కన్నేసిన ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

DRAINAGES ARE IN VERY BAD SITUATION IN TELANGANA MUNICIPALITIES
DRAINAGES ARE IN VERY BAD SITUATION IN TELANGANA MUNICIPALITIES

By

Published : Jan 11, 2020, 12:30 PM IST

Updated : Jan 11, 2020, 12:36 PM IST

కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

ఎన్ని ఎన్నికలొచ్చినా..ఎందరు నాయకులొచ్చినా ఇంతేనా..?

మున్సిపల్ పోరుతో పట్టణాల్లో రాజకీయ హడావిడి మొదలైంది. విజయ బావుటా ఎగరేసేందుకు అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో శ్రీకారం చుడుతున్నారు. ఇదంతా రాజకీయ నాయకుల తంటాలైతే... ఓటర్ల పాట్లు మరోలా ఉన్నాయి. పంచాయతీ నుంచి పట్టణ స్థాయికి వెళ్తే కనీస సౌకర్యాలతో పాటు అభివృద్ధి జరుగుతుందనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. ఎన్నిసార్లు ఎన్నికలొచ్చినా... ఎంతమంది నాయకులు మారినా... అభివృద్ధి మాత్రం వారి వీధిని పలకరించటం లేదని గగ్గోలు పెడుతున్నారు.

మురుగున పడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ

నీటి కష్టాలు ఎన్ని ఉన్నా వీధుల్లో నిలిచే మురికి కుంటలకు మాత్రం కొదవుండట్లేదు. వేసవి కాలంలోనూ దోమలకు నిలయంగా మారాయి. పట్టణాల్లో ఈ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. సిబ్బంది కొరతతో పంచాయతీ స్థాయి సేవలే అందుతున్నాయి. జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేక డ్రైనేజీల నిర్వహణ మురుగున పడిపోతోంది. చెత్త, ప్లాస్టిక్​ వ్యర్థాలు మురికి కాల్వల్లో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇక్కడే... దోమలు, పందులు స్వైరవిహారం చేస్తూ జనాలకు రోగాలను అంటిస్తున్నాయి.

చెత్త కొట్టుకుపోతున్న వీధులు...

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం...పట్టణాలను విస్మరించింది. పట్టణ వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం-ప్లాస్టిక్​ వ్యర్థాలు పారిశుద్ధ్య నిర్వహణా లోపానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం అంతంతమాత్రంగానే నడుస్తున్నట్లు కన్పిస్తోంది. సిబ్బంది కొరత కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణంగా మారింది.

పట్టణాలను స్వచ్ఛంగా తయారు చేస్తేనే..!

ప్రతీ మున్సిపాలిటీ పరిస్థితీ ఇంతే అధ్వానంగా తయారవటం శోచనీయం. డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణ అంశాలను ప్రధాన సమస్యలుగా పరిగణించి, శాశ్వత పరిష్కారాలు చూపి స్వచ్ఛ పట్టణాలుగా మార్చే బాధ్యత ఇప్పుడొచ్చే పాలక వర్గాలపై ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పట్టణానికి తీసుకొస్తామని కాదు... "మీ పట్టణాన్ని స్వచ్ఛంగా తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా"మని హామీలిస్తేనే ఓట్లేసే పరిస్థితి కన్పిస్తోంది.

స్థానికులే స్వచ్ఛ కార్యకర్తలు కావాలి...

ప్రజాప్రతినిధులు, మున్సిపల్​ సిబ్బందే కాకుండా ప్రజలూ... పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సి అవసరం ఎంతైనా ఉంది. నాలాల్లో చెత్త వేయకుండా... రోడ్లపై నీరు నిలవకుండా... ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పారేయకుండా స్థానికులే స్వచ్ఛ కార్యకర్తలుగా మారితే... రోగాలబారి నుంచి రక్షించుకోవచ్చు.

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Last Updated : Jan 11, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details