తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad: ప్రతిపాదనలకే పరిమితమైన ప్రణాళికలు

వరుణ బీభత్సంతో గత ఏడాది వానకాలంలో హైదరాబాద్‌ మహానగరం స్తంభించి మహాసముద్రమైంది. చెరువులు, కుంటలు కట్టలు తెంచుకుని... కాలనీలను ముంచెత్తాయి. నీటమునిగిన ఇళ్లు, కొట్టుకొచ్చిన శవాలు, రోడ్డున పడ్డ జీవితాలు... ఇలా భాగ్యనగరంలో వరదల తాలుకు భయాలు ఇంకా వీడటంలేదు. నగరంలో ఒక్క సరూర్‌నగర్‌ చెరువు ఉప్పొంగటంతోనే.... వందల కాలనీలు ముంపునకు గురయ్యాయి. వానకాలంలో మళ్లీ వరదలు వస్తే ఎంటనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావొస్తున్నా... పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు.

Hyderabad
హైదరాబాద్​

By

Published : Jun 24, 2021, 4:58 AM IST

హైదరాబాద్‌లో వరద ముంపు నివారణా ప్రణాళికలు.... ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయటంలో ఉదాసీనత కనిపిస్తోంది. టెండర్లు పూర్తై నెలలు అవుతున్నా... పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవటం లేదు. అధికార యంత్రాంగం తీరుతో... వర్షాకాలమంటేనే హైదరాబాదీలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. గత ఏడాది వానకాలంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన వర్షానికి నగరమంతా అల్లకల్లోలమైంది. సరూర్‌నగర్‌ చెరువు కింద ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. గడ్డి అన్నారం, లింగోజిగూడ, చంపాపేట, చైతన్యపురి డివిజన్ పరిధిలో 200కుపైగా కాలనీలుండగా..... వీటిలో 70 నుంచి 80 కాలనీలకు వరద ముంపు ప్రమాదముంది. ఎగువన ఉన్న మహేశ్వరం, మీర్‌పేట, బడంగ్‌పేట్, బాలాపూర్, బైరామల్‌గూడ చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోగా... అక్కడి వరద నీరంతా.... సరూర్‌నగర్‌ చెరువులోకి వచ్చి చేరుతుంది. ఒకప్పుడు 125 ఎకరాలున్న సరూర్‌నగర్ చెరువు... ప్రస్తుతం 30 ఎకరాలకు తగ్గిపోయింది. నాలాల్లో పూడిక తొలగించకపోవటం, ఎగువ నుంచి వచ్చే 7 చెరువుల నీరు కలవటంతో.... సరూర్‌నగర్‌ చెరవు ఓవర్ ఫ్లో అవుతోంది.

రోజుల తరబడి నీళ్లలోనే

గతేడాది వరద బీభత్సంతో సరూర్‌నగర్ మండలం కోదండరాంనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు, మరో వృద్ధుడు నీటిలో కొట్టుకుపోయారు. మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా వాహనంతో సహా... చెరువులో పడిపోయాడు. గడ్డి అన్నారంలో కోదండరాంనగర్, వివేకానందనగర్, కమలానగర్, శారదానగర్, పీఎన్​టీ కాలనీ పూర్తిగా మునిగిపోగా... చంపాపేట్‌లో ఉదయ్‌నగర్, పద్మానగర్, సూర్యనగర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డినగర్, లింగోజిగూడ డివిజన్‌లో కాకతీయ కాలనీ, శాతావాహననగర్, ధర్మపురి, నారాయణపురి, సాయినగర్ కాలనీలు ఇలా.... 70 నంచి 80 వరకు కాలనీలు నీట మునిగాయి. చాలా కుటుంబాలు రోజుల తరబడి నీళ్లలోనే కాలం వెళ్లదీశారు. కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. చెరువులోకి యూజీడీ లైన్స్ కలపటం, నాలాలు పునరుద్ధరణ చేపట్టకపోవటం, అక్రమ కట్టడాలు, నాలాల విస్తరణ లేక వాటిపై అధిక ఒత్తిడి కారణంగా వరద నీరు కాలనీలను ముంచెత్తోంది. మరోవైపు చెరువు తూములు మూసుకుపోవటం, చెరువు నీటి ఇన్ అండ్ ఔట్‌కు కంట్రోల్ సిస్టం లేకపోవటంతో ఈ ఉపద్రవం సంభవిస్తోంది. వరద ముంపు ఎదుర్కొనే కాలనీల్లోని ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉందని.. ఆస్తులకు డిమాండ్ కూడా పడిపోయిందని ముంపు కాలనీలవాసులు వాపోతున్నారు.

మళ్లించటంతో శాశ్వత పరిష్కారం

లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సంతో సంబంధిత అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. లక్షల్లో ఆస్తి నష్టం జరగగా... 10 వేల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాల్వల అభివృద్ధి, నాలాలు విస్తరణ, బాక్స్ డ్రైన్లు లాంటివి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కాని అవన్నీ దస్త్రాలకే పరిమితమయ్యాయి. అధికారుల ఉదాసీనతతో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. 4 డివిజన్ల పరిధిలో దాదాపు 2లక్షల కుటుంబాలు వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలతో లోతట్టు ప్రాంతాలను ముంపు బారి నుంచి కాపాడే అవకాశముంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రణాళికలు సైతం రూపొందించింది. కాలనీల నుంచి కాకుండా ప్రధాన రహదారుల వెంబడి ట్రంక్ లైన్లతో వరద నీరు మూసీలోకి మళ్లించటంతో శాశ్వత పరిష్కారం లభించే అవకాశముంది. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తే... రాబోయే రోజుల్లో ముంపు నుంచి కాపాడే అవకాశముంటుందని పలువురు చెబుతున్నారు.

ఇదీ చదవండి: SCHOOLS RE OPEN: 'పాఠశాలల ప్రారంభంపై మార్గదర్శకాలు రూపొందించండి'

ABOUT THE AUTHOR

...view details