తెలంగాణ

telangana

కేంద్రం నివేదిక: అవయవాలు కావాల్సిన వారు లక్షల్లో.. దాతలు వేలల్లో

By

Published : Dec 25, 2022, 7:47 AM IST

Organ Donation : కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో ఏటా 1.8 లక్షల మూత్రపిండాల వైఫల్య కేసులు నమోదవుతుండగా.. కిడ్నీ మార్పిడులు కేవలం 6 వేలే జరుగుతున్నాయి. ఏటా 25-30 వేల వరకు కాలేయ మార్పిడులు అవసరం ఉండగా.. జరుగుతున్నవి కేవలం 1,500 మాత్రమే. దేశంలో 50 వేల మంది గుండె వైఫల్యంతో బాధపడుతుండగా.. హృదయ మార్పిడి శస్త్రచికిత్సలు 10-15కి మించడం లేదు. కారణం.. అవయవ దానానికి దాతలు ముందుకు రాకపోవడమే. అపోహలు తొలగించుకొని దాతలు ముందుకు రావాలంటున్నారు వైద్య నిపుణులు.

organ donation
organ donation

Organ Donation : అవయవ మార్పిడి శస్త్రచికిత్స ఖరీదైనది.. క్లిష్టమైనది. దేశంలో అవయవ వైఫల్య బాధితులు పెరుగుతుండగా.. దాతలు మాత్రం అతి స్వల్పంగా ముందుకు వస్తున్నారు. అవయవ దానాలు రెండు రకాలు. ఒకటి జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్‌ రోగులు) నుంచి, రెండోది.. సజీవులైన సమీప బంధువుల నుంచి. దేశం మొత్తమ్మీద జీవన్మృతుల నుంచి సేకరించిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నిర్వహణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

సజీవుల నుంచి అవయవదానాల్లో దిల్లీ ముందు వరుసలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు రకాల శస్త్రచికిత్సలూ గుర్తించదగ్గ స్థాయిలో నమోదయ్యాయి. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా నివేదికలో పై వివరాలు వెల్లడించింది.

తెలంగాణలో కొంత మెరుగే..:తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తోంది. అవయవ మార్పిడి చేయించుకున్న రోగి అతి ఖరీదైన మందుల్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. వాటి ఖరీదు తొలి ఆర్నెల్లలో రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా వీటి ఖర్చు ఏడాదికి రూ.1.20 లక్షలకు పైమాటే. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్సతో పాటు జీవితాంతం మందులనూ ఉచితంగా అందజేస్తోంది.

రాష్ట్రంలో జీవన్‌దాన్‌ కింద 2013 నుంచి ఇప్పటివరకు 4,345, 2022లో 680 అవయవదానాలు జరిగాయి. వీటిలో జీవన్మృతుల నుంచి సేకరించిన అవయవ దానాలే ఎక్కువ. సమీప రక్త సంబంధీకులు కూడా ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ సమయంలో అవయవదానాలు తగ్గినా.. తెలంగాణలో మాత్రం వాటి సంఖ్య మెరుగ్గానే ఉంది.

"రోడ్డు ప్రమాదాలు, మెదడులో రక్తస్రావం తదితర కారణాలతో జీవన్మృతుడైన ఒక రోగి నుంచి కనీసం 8 మందికి అవయవాలను దానం చేయొచ్చు. బ్రెయిన్‌ డెడ్‌ ప్రకటించడాన్ని జిల్లాల్లోని బోధనాసుపత్రుల్లోనూ నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. అవయవ దానంపై రోగి బంధువులకు ముఖ్యంగా రక్తసంబంధీకులకు అవగాహన కల్పించేలా మరింత దృష్టి పెట్టాం. దీనిపై రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే చైతన్యం పెరుగుతోంది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా అవయవదాన చికిత్సలు చేస్తున్నాం. ప్రస్తుతానికి జీవన్మృతుల నుంచి సేకరణలో దేశంలోనే ముందున్నాం. సజీవుల నుంచి సేకరణలోనూ ముందు నిలిచేలా కృషి చేస్తాం".-హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details