ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు సమీపంలో వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్ అనే యువకుడు తాను వివాహం చేసుకునే రోజునే తనతోపాటు తన బంధువులు, స్నేహితులతో కలిసి అవయవదాన హామీ పత్రాలు సమర్పించాలని నిర్ణయించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాబోయే భర్త ఆలోచనకు మెచ్చి పెళ్లి కుమార్తె సజీవరాణి కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
విశాఖలోని ‘సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్’ ఛైర్‌పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి ఈనెల 29వ తేదీన నిడదవోలులో జరిగే వివాహ వేడుకకు హాజరై ఆయా పత్రాలను స్వీకరించనున్నారు. వివాహం సందర్భంగా ఏదైనా మంచి పనిని వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతోనూ, వివాహం రోజునే ఒక మంచి పనికి నాంది పలకాలన్న లక్ష్యంతోనూ వధూవరులిద్దరూ ఆ మేరకు నిర్ణయించుకున్నారు.