తెలంగాణ

telangana

ETV Bharat / state

బతికుండగానే బాబు చనిపోయిండని చెప్పేశారు

అదో పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి. అత్యాధునిక యంత్రసామాగ్రితో ఎల్లవేళలా చికిత్సలందిస్తారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా డబ్బులు చెల్లించాకే... కదలాలి. లేకపోతే... బతికున్న వాళ్లని కూడా చనిపోయారని చెప్పేస్తారు.

బతికుండగానే బాబు చనిపోయిండని చెప్పేశారు

By

Published : Aug 7, 2019, 9:59 AM IST

Updated : Aug 7, 2019, 10:47 AM IST

హైదరాబాద్ నారాయణగూడలోని సన్​రైజ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఫీజు కోసం వైద్యులు చెప్పిన ఓ విషయం కన్నతల్లి గుండెల్ని పిండేసింది. కంటతడి పెట్టించింది. కన్నబిడ్డ ఇక లేడనే వార్తతో కాసేపు తన గుండే ఆగిపోయినట్లుగా షాక్​కు గురైంది ఆ మాతృమూర్తి. తేరుకొని ఇదేంటని యాజమాన్యాన్ని గట్టిగా నిలదీసే సరికి బాబు చనిపోలేదు... బతికే ఉన్నాడనే విషయం తెలుసుకుంది. డబ్బుల కోసం వైద్యులు చెప్పిన అబద్ధంతో ఆ కన్నతల్లి విస్మయానికి గురైంది.

రూ. 60 వేల ఫీజు కోసం అబద్ధం

బాలాపూర్ జిల్లెలగూడకు చెందిన ఇస్లావత్ కైలాష్, సరోజ దంపతులకు ఐదు నెలల క్రితం బాబు పట్టాడు. ఆ బాబుకి నిమోనియా సోకడం వల్ల గత నెల 28న సన్​రైజ్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారం రోజుల పాటు వైద్యం చేసిన వైద్యులు... లక్షా అరవై వేల రూపాయలకు పైగా వసూలు చేశారు. బాబు పరిస్థితి విషమించిందని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తమ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల రెండ్రోజులు వైద్యం అందిస్తే... తర్వాత గాంధీకి తీసుకెళ్తామని బతిమిలాడారు ఆ తల్లిదండ్రులు. అదేమీ పట్టించుకోని యాజమాన్యం మరో రూ.60 వేల ఫీజు రాబట్టేందుకు బాబు చనిపోయాడని అబద్ధం చెప్పారు. మిగతా డబ్బులు చెల్లించి బాబు మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించడం వల్ల తీవ్ర ఆందోళనకు గురైన బాబు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటిలేషన్ లేకపోవడం వల్లే...

పోలీసుల రంగ ప్రవేశంతో.. భయపడిన యాజమాన్యం బాబు చనిపోలేదని, బతికే ఉన్నాడని మాటమార్చారు. వెంటనే బాబుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారికి రెండోస్థాయి వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని, మూడోస్థాయి వెంటిలేటర్​ తమ వద్ద లేకపోవడం వల్లే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు వైద్యలు వెల్లడించారు. కానీ వారే తమ మాటను వినకుండా ఇక్కడే వైద్యం అందించాలని కోరారని ఆసుపత్రి యాజమాన్యం తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

బతికుండగానే చంపేశారా బాబుని

ఇవీ చూడండి: 'సుష్మా' భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

Last Updated : Aug 7, 2019, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details