ప్రతి పౌరుడు వ్యక్తిగత బాధ్యతగా జాగ్రత్తలు పాటించి కరోనా కట్టడికి కృషి చేస్తే... రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని అమెరికాలోని శ్వాసకోశ వైద్యులు ప్రసాద్ గరిమెళ్ల అన్నారు. వైరస్ వేరియంట్లు ఎక్కువ అవుతుండడంతో... ప్రజలు తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు, వ్యాక్సినేషన్‌తోనే అమెరికాలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్న ఆయన... అధిక స్టెరాయిడ్స్ వాడడం వల్లే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని వెల్లడించారు.
అసత్యాలకు అడ్డుకట్ట
అమెరికాలో కరోనా నియంత్రణలో ఉందని ప్రసాద్ అన్నారు. జులై చివరికల్లా కొవిడ్ ఫ్రీ కంట్రీగా అమెరికా మారుతుందని ఆయన తెలిపారు. అట్లాంటాలోని మెడికల్ సర్వీసుకు డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్న డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల... అక్కడ స్థిరపడిన భారతీయ వైద్యులతో కలిసి సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆ సంస్థ ద్వారా భారతీయ వైద్యులకు తగిన సలహాలతో పాటు వైద్య పరికరాలు, రోగులకు ప్రాణాధార మందులు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. భారత్‌ను భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ కొత్తదేమీ కాదని... కొవిడ్ రోగులకు అనవసరమైన చికిత్స వల్లే బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుందని డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. అధికంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి 5 నుంచి 7 శాతం ప్రజలు ఈ బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని వెల్లడించారు. భారత్‌లో కొవిడ్‌పై అసత్యప్రచారాన్ని విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలంటున్నారు.