మహా శివరాత్రి.. జగమంతా శివనామ స్మరణలో మునిగిపోయే పవిత్రమైన దినం. ఆ రోజున ఏడేడు లోకాల్లోని పుణ్యక్షేత్రాలు మారేడు దళంలో నిక్షిప్తమై శివుడికి అర్చన గావించబడుతాయంటారు. అందుకే.. శివరాత్రి రోజున ఉపవాసం ఆచరించి కనీసం ఒక్క మారేడు దళంతో అయినా.. శివుడికి అర్చన చేయాలని శాస్త్రాలు చెప్తాయి. అయితే.. మహా శివరాత్రి రోజున ఆలయాల్లో ప్రత్యేకంగా నాలుగు యామాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాలామందికి ఈ పూజల గురించి తెలియదు. కానీ.. మనసులో ఏదైనా అనుకుని నియమంతో నాలుగు యామాల పూజలు నిర్వహిస్తే.. కోరికలు తీరుతాయని నమ్మకం.
తొలి యామం
శాస్త్రోక్తంగా నిర్వహించే యామాల పూజలో తొలియామానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ పూజలో భాగంగా.. గంధం, మారేడు దళాలు, తామరపూలతో శివుడికి అర్చన చేస్తారు. రుగ్వేద పారాయణ చేస్తారు. అర్చన అనంతరం పెసర పొంగలి నైవేద్యంగా పెడతారు. ఈ పూజ చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
రెండో యామం
ఈ పూజలో పాలు, పెరుగు, నెయ్యి, పంచదారతో కలిపి అభిషేకం చేస్తారు. అభిషేక ప్రియుడైన శివుడికి ఈ అభిషేకమంటే చాలా ఇష్టం. అభిషేకం తర్వాత కర్పూరం, పన్నీరు, గంధం లేపనాలతో అలంకరించి తులసి, మారేడు దళాలతో అర్చన చేసి.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ యామం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని శివభక్తుల నమ్మకం. ఈ పూజ అనంతరం యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు.