జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
15:54 May 04
జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
ఈటల కుటుంబానికి చెందిన జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈటల కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై.. న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని, కలెక్టర్ నివేదికను పంపలేదని ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవటాన్ని తప్పుపట్టిన హైకోర్టు.. సహజ న్యాయసూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈటల భూముల్లో సర్వే జరిపిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. కలెక్టర్ నివేదికతో ప్రమేయం లేకుండా చట్టప్రకారం వ్యవహరించవచ్చని హైకోర్టు సూచించింది. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలంది. విచారణకు సహకరించేలా పిటిషనర్లను ఆదేశించాలని అడ్వొకేట్ జనరల్ కోరగా.. పిటిషనర్లు సహకరించకపోతే చట్టప్రకారం వ్యవహరించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ