ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ చేశామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు(DH Srinivasa Rao) హైకోర్టుకు(High Court) నివేదించారు. 170 ప్రైవేట్ ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని.. 30 ఫిర్యాదులు పరిష్కరించి 72లక్షల20 వేలు వెనక్కి ఇప్పించామని వివరించారు.
డీహెచ్ నివేదిక
మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డీహెచ్(DH ) హైకోర్టుకు తెలిపారు. కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణలో భాగంగా.. శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రోజుకు సరాసరి లక్ష 17 వేల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని.. పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని.. 28 లక్షల 76 వేల మందికి రెండు డోస్‌లు, 68 లక్షల 48 వేల మందికి ఒక డోస్ పూర్తి చేశామని వివరించారు.
పాజిటివిటీ రేటు ఇలా..
రాష్ట్రంలో ఇంకా కోటి 94 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నెల 29 నాటికి కేంద్రం నుంచి 10 లక్షల 76 డోసులు రావాల్సి ఉందని డీహెచ్ హైకోర్టుకు వెల్లడించారు. హైరిస్కు గ్రూపుల్లో 23 లక్షల11 వేల మందికి వ్యాక్సిన్ పూర్తయిందని... విదేశాలకు వెళ్లే 6వేల 874 మంది విద్యార్థులకు వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. మానసిక ఒత్తిడికి చికిత్స, కౌన్సిలింగ్ కోసం అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామని డీహెచ్ వివరణ ఇచ్చారు. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 27వేల 141 పడకలకుగాను.. 10వేల224 పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామన్నారు.
మిగతా 16వేల 914 పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. నిలోఫర్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశామని.. పిల్లల వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటున్నామని డీహెచ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిల్లల చికిత్సలకు అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచామని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఇవే..