Telangana Devotional day Today : రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొత్తగా 2,043 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. యాదాద్రిలో మిల్లెట్ ప్రసాద సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం సంప్రదాయాలు, ఆలయాలు, పండుగలు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని వివరించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం నేపథ్యంలో దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ రంగంలో రాష్ట్ర పురోగతిని వివరించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలు, వేడుకలకు ప్రపంచ ఖ్యాతి లభించిందని అన్నారు. అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి తోడ్పడ్డారని మంత్రి అన్నారు.
Telangana Decade celebrations 2023 :లక్ష్మీ నర్సింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట ఆలయం దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒక్కటిగా రూపుదిద్దడం అందరికీ గర్వకారణమని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజనేయ స్వామి, భద్రాద్రి రాములోరి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తుననట్లు తెలిపారు.
Indrakaran Reddy on Devotional Day : దేవాలయాల జీర్ణోద్ధరణతో ధార్మిక కార్యక్రమాలు విస్తరణలో భాగంగా కామన్ గుడ్ ఫండ్ నిధులతో రాష్ట్రంలోని అనేక ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్దితో పాటు ఆలయాల నిర్వహణ ముఖ్యమని భావించి.. అర్చకులు, ఆలయ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి పాలనలో అన్యాక్రాంతమైన ఆరువేల ఎకరాల ఆలయ భూములను న్యాయపోరాటం చేసి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.