తెలంగాణ

telangana

ETV Bharat / state

బత్తాయి రసానికి డిమాండ్‌.. రైతులకు లాభాల పంట

రాష్ట్రంలో బత్తాయి ధర.. రైతున్నలను లాభాల బాట పట్టిస్తోంది. తోట వద్దే టన్ను కాయలు రూ.70 వేలు పలుకుతున్నాయి. గడ్డిఅన్నారం మార్కెట్లో అయితే టన్ను కాయలు రూ. 90వేలు అంటున్నారు. దిల్లీలో ఏకంగా లక్షకు పైనే ఉంది.

Demand for  oranges in telangana
బత్తాయి రసానికి డిమాండ్‌.. రైతులకు లాభాల పంట

By

Published : Jun 9, 2021, 9:49 AM IST

రాష్ట్రంలోని బత్తాయి రైతులకు లభిస్తున్న ధర వారిని సంతోషానికి గురిచేస్తోంది. ఎన్నడూ లేని విధంగా టన్ను బత్తాయికి రూ.65 వేల నుంచి రూ.70 వేల ధర పలుకుతోంది. అదీ తోటల వద్దనే కావడం గమనార్హం. దళారులు నేరుగా తోటల వద్దకే వచ్చి బత్తాయి పళ్లను తీసుకువెళ్తున్నారు. ఈ పంట దిగుబడి అధికంగా ఉండే నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నుంచి కొందరు రైతులు మరింత ధర కోసం నేరుగా హైదరాబాద్‌ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. ఇటీవలి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు ప్రాంతాల బత్తాయిలు మార్కెట్‌కు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం వాటి రాక తగ్గి ఇక్కడి బత్తాయిలకు గిరాకీ పెరిగింది. కత్తెర సీజను కావడంతో బత్తాయి దిగుబడి తక్కువగా ఉండి నాణ్యమైన పండ్లకు అధిక ధర ఉంటుంది. వీటన్నింటికీ తోడు కరోనా నేపథ్యంలో బత్తాయి రసం తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థకు మేలు జరుగుతుందన్న ప్రచారంతో వాటి వినియోగం పెరిగి బత్తాయిలకు మరింత డిమాండ్‌ను తీసుకువచ్చింది. లాక్‌డౌన్‌ తొలగించగానే దిల్లీ, ముంబయి మార్కెట్‌లలో డిమాండ్‌ మొదలై ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఏటా కత్తెర సీజనులో టన్ను బత్తాయిల ధర రూ.50 వేల లోపు పలికేది. ఈసారి మాత్రం నాణ్యమైన బత్తాయిల ధర టన్నుకు మార్కెట్లో రూ.90 వేల వరకూ పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైనవి అంటే రసం బాగా వచ్చే పండు బత్తాయిలు దిల్లీ మార్కెట్‌లో టన్ను రూ.లక్షకు పైగా ధర పలికినట్లు చెబుతున్నారు.

రూ.65 వేల ధర ఇస్తామన్నారు

మా తోటలో 15 టన్నుల బత్తాయి కోతకు సిద్ధంగా ఉంది. ఇక్కడి వ్యాపారులు టన్ను బత్తాయిని రూ.65 వేలకు అడిగారు. కానీ నేను ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ ఇంత ధర పలకడం నేను చూడలేదు. లాక్‌డౌన్‌ ముగిస్తే ఇంకా పెరగవచ్చని భావిస్తున్నాను.

ఇంత ధర ఊహించలేదు

పదెకరాల తోటలో అయిదు టన్నుల బత్తాయి మాత్రమే దిగుబడి వచ్చింది. నెల క్రితమే టన్నుకు రూ.46 వేలకు తోటవద్దే వ్యాపారులకు ఇచ్చాను. ఇప్పటి వరకు ఆగి ఉంటే కనీసం రూ.80 వేలకు పైనే వచ్చేది.

ABOUT THE AUTHOR

...view details