Drugs Supply Gang Arrest in Hyderabad : వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. ఆ తర్వాత మాదక ద్రవ్యాలను విక్రయించడమే వ్యాపారంగా మలచుకున్నాడు. కొకైన్ విక్రయిస్తూ లాభాలు చవిచూశాడు. తనలాగే వ్యాపారంలో నష్టపోయిన మరో ఇద్దరిని ఏజెంట్లుగా నియమించుకొని మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడు. నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌కు చెందిన చింతా రాకేశ్ అనే వ్యక్తి గతంలో డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసేవాడు. అందులో నష్టం రావడంతో.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని మాదక ద్రవ్యాలను రవాణా చేయడం మొదలుపెట్టాడు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో కొకైన్ విక్రయించాడు. గోవాలో రూ.7 వేలకు గ్రాము చొప్పున కొని.. హైదరాబాద్‌లో రూ.18 వేలకు అమ్ముతున్నాడు.
పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో గొట్టం గోలీల్లో కొకైన్ నింపుతున్నారు. ఆ తర్వాత వాటిని మింగి.. నిర్ధేశించుకున్న ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ బస చేస్తారు. మల విసర్జన సమయంలో ఆ గొట్టం గోలీలు సైతం మలంతో పాటు బయటికు వస్తాయి. అనంతరం ఆ గొట్టం గోలీలను శుభ్రపరిచి వాటి లోపల ఉన్న కొకైన్‌ను బయిటకు తీసి ప్యాకెట్లలోకి మారుస్తున్నారు. ఏదైనా ఆహారం తీసుకుంటే జీర్ణమైపోతుంది.. కానీ గొట్టం గోళీలకు ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థం, జీర్ణక్రియలో కరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిందితుల చీకటి వ్యాపారాన్ని పసిగట్టిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు.. వారిపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.