రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సీఎస్ సమీక్షించారు.
చట్టాల అమలు కోసం అదనపు కలెక్టర్ పోస్టులను మంజూరు చేసిన దృష్ట్యా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను పచ్చదనంగా ఉంచాలని సీఎస్ ఆదేశించారు. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి నెల క్రమం తప్పకుండా రూ. 456 కోట్లు విడుదల, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇవ్వడంవల్ల సమస్యలు లేవని చెప్పారు. అదనపు కలెక్టర్లు... పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను తనిఖీ చేసి రోజూ రహదారులను, మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పూర్తి చేయండి...
స్థానిక సంస్థలలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, చెత్త వేరు చేయడం, సమీకృత కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు లాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన దృష్ట్యా మార్చిలోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సోమేశ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం కోసం టీఎస్‌బీపాస్ అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. భవన నిర్మాణ అనుమతులు వేగంగా జారీతో పాటు ఎటువంటి ఆక్రమణలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ పోలీసులకు స్కోచ్ బంగారు పతకం