కరోనా కేసులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీఎస్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు జరుగుతున్నాయని సీఎస్ కోర్టుకు నివేదించారు. పరీక్షలు క్రమంగా పెంచుతున్నామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బులెటిన్‌లో మరిన్ని వివరాలు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ వ్యవస్థ ఉండేలా కసరత్తు చేస్తున్నామని వివరించారు. కేంద్రం మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని... కరోనా నియంత్రణకు రాష్ట్ర యంత్రాంగం నిరంతరం కృషిచేస్తోంది వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి అమలు చేస్తామన్నారు. అధికారుల పరిస్థితిని హైకోర్టు అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరీక్షల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రైమరీ కాంటాక్ట్‌లకు ఎన్ని పరీక్షలు చేశారు.. గాంధీలో కరోనా పరీక్షలు చేస్తున్నారా?.. లేదా? అని అడిగింది. కరోనా వివరాల బులెటిన్‌ను తెలుగులో కూడా ఇవ్వాలని ఆదేశించింది. పలు రాష్ట్రాలు మాతృభాషలో బులెటిన్ ఇస్తున్నాయని తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రులు, కేంద్రాల్లో నిర్ధరణ పరీక్షల ధరలు ఖరారు చేశారా? అంటూ ప్రశ్నించింది.