తెలంగాణ నుంచి ఒకే రోజు రికార్డు స్థాయిలో 40 రైళ్ల ద్వారా దాదాపు 50 వేల వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలించారు. ఆ ప్రక్రియను సాఫీగా పూర్తిచేసినందుకు రైల్వే అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి శనివారం వివిధ రైల్వే స్టేషన్ల నుంచి వలస కార్మికులను వివిధ రాష్ట్రాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 124 రైళ్ల ద్వారా 1.58 లక్షల మంది వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు తరలించామని చెప్పారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13.15 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు
రాష్ట్రంలో పశ్చిమ బంగాల్ మినహా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు దాదాపు పూర్తి అయిందని సోమేశ్ కుమార్ అన్నారు. వెస్ట్ బెంగాల్లో అక్కడి పరిస్థితులు చక్కబడ్డాక ఆ రాష్ట్రం వలస కార్మికులను ఒకటి రెండు రోజుల్లోనే పంపడానికి 10 రైళ్లను సిద్ధంగా ఉంచామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇంకా మిగిలి ఉంటే వారిని కూడా పంపడానికి ఒకటి లేదా రెండు రైళ్ల ద్వారా పంపేందుకై చర్యలను చేపట్టామని అన్నారు.