CRPF Constable Ammunition Theft in Secunderabad Railway Station : ఆ వ్యక్తి చిల్లర దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రైల్లేస్టేషన్‌లో సంచరిస్తూ పర్సులు, ఇతర వస్తువులు చోరీచేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడికి.. విశాంత్రి తీసుకుంటున్న ఓ కానిస్టేబుల్ పక్కన ఉన్న సంచి కనిపించింది. దీంతో అతను వెంటనే ఆ బ్యాగును తస్కరించాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ బ్యాగులో బుల్లెట్లు, మ్యాగజైన్లు ఉండటంతో.. దొంగతనం చేసిన వ్యక్తి భయపడిపోయాడు. దీంతో ఆ సంచిని ఓ చోట పడేసి పారిపోయాడు. తీరా బ్యాగ్ పోయిందన్న విషయాన్ని గుర్తించిన బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్ (CRPF) యూనిట్‌లో జవాన్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ్ సింగ్ ఈనెల 23న వారణాసి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అతనితోపాటు మరో నలుగురు జవాన్లు కూడా ఉన్నారు. తమతో పాటు తెచ్చుకున్న బుల్లెట్లు, మ్యాగజైన్లను బ్యాగును పక్కనే ఉంచుకొని విశ్రాంతి తీసుకున్నారు. కాసేపటి తర్వాత చూసే సరికి సిద్దార్థ్ సింగ్ బ్యాగు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే ఆయన... ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Bullets: కానిస్టేబుల్ బుల్లెట్ల బ్యాగ్ మాయం.. ఇలా దొరికింది!
Bullets Bag Theft in Secunderabad :ఈ విషయాన్ని జీఆర్పీ అధికారులు, అదనపు డీజీ శివధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తూటాలు దుర్వినియోగమైతే సమస్యలు ఎదురవుతాయని ఉద్దేశంతో శివధర్ రెడ్డి.. రైల్వే రక్షక దళం ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే రక్షక దళం అధికారులు 8 బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. 10వ నంబర్ ఫ్లాట్ ఫామ్ దగ్గర ఓ వ్యక్తి.. సీఆర్పీఎఫ్ జవానుకు చెందిన బ్యాగును దొంగతనం చేసినట్లు గుర్తించారు.
బ్యాగును ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించేందుకు.. పోలీసు బృందాలు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి అతను గాంధీ ఆసుపత్రి వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని గుర్తించి బ్యాగును.. స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులో పోలీసులకు 60 తూటాలు, 3 మ్యాగజైన్లు కనిపించలేదు. దీంతో నిందితుడు ఆనంద్‌ను ప్రశ్నించగా భయపడిబుల్లెట్లను మెట్రో పిల్లర్ పక్కనే వదిలేసినట్లు పోలీసులకు తెలిపాడు.