Crops Damage in Telangana: అకాల వర్షాలు.. అన్నదాతను వదిలేలా లేవు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తానూర్ మండలంలో వడగళ్ల వాన పడింది. వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దయింది.
అన్నదాతలు ఆందోళన:బాన్సువాడలోనూ ఇదే దుస్థితి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కొనే దిక్కే లేక.. తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం.. వడగళ్ల వానతో చేతికొచ్చిన పంట నేలరాలింది. గంభీరావుపేట్ మండలంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులకు తంగళ్లపల్లి, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, తదితర మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి.
వరదలో కొట్టుకుపోయిన ధాన్యం:జగిత్యాల జిల్లా ధర్మపురిలో మార్కెట్ యార్డ్‌లో ధాన్యం తడిచి ముద్దయింది. కమలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రంలో.. ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. వడ్ల పైన కప్పడానికి టార్పాలిన్ కవర్లు కూడా.. అధికారులు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.
పంట నష్టపోయిన వారికే న్యాయం చేయాలి: ఖమ్మం జిల్లా మధిరలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని నాలాల ఆక్రమణల కారణంగా.. వర్షపు నీరంతా ప్రధాన వీధులపైకి రావటంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం విషయంలో.. వ్యవసాయ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పంట నష్టపోయిన అన్నదాతలవి కాకుండా.. నష్టపోని రైతుల భూముల్లో సర్వే చేశారని వ్యవసాయ అధికారులను అడ్డగించారు. సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. పంట నష్టపోయిన వారికే న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.